హవేళీఘనపూర్, ఆగస్టు 20: 20 రోజులుగా పెండ్లిళ్ల ముహూర్తాలు ఉండడంతో జోరుగా కొనసాగాయి. ఈనెల 1వ తేదీ నుంచి 21వ తేదీల వరకు పెండ్లి ముహూర్తాలు ఉండడంతో పెండ్లి ఫంక్షన్‌హాళ్లు, పూలు, పందిళ్లు, పంతుళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 20 రోజులుగా ఫంక్షన్ హాళ్లకు తీరికలేకుండాపోయింది. దీంతో హాల్ నిర్వాహకులు ఇష్టారీతిలో తమ డిమాండ్‌ను తెలిపారు. సాధారణ రోజుల్లో రూ.20 నుంచి రూ.40 వేల వరకు ఉండే ఫంక్షన్ హాళ్ల ధరలు రెట్టింపయ్యాయి. నేడు ఎక్కువ పెండ్లీళ్లు ఉండడంతో డెకరేషన్, పెండ్లి పందిళ్లకు భారీగా ధరలు పెరిగాయి. మాములు సమయాల్లో ఒక కట్ట పువ్వులు రూ.30 ఉండగా, శనివారం రూ.100కు పైగా పెరగడంతో డెకరేషన్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. పెండ్లీళ్లకు తాము బుక్‌చేసుకున్న ధరల కంటే అధికం కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ముహుర్తాలు లేవని మెదక్ అర్చకుడు వైద్య శ్రీను తెలిపారు. శ్రావణ మాసం నుంచి నేటి వరకు ముహూర్తాలు ఉండడంతో చాలా పెండ్లీళ్లు జరిగాయని, ఎక్కువగా 20, 21వ తేదీల్లోనే పెండ్లీళ్లు ఉండడంతో అర్చకులు బిజీబిజీగా ఉన్నారని ఆయన తెలిపారు.