సంగారెడ్డి, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పరిష్కారాలు చూపేందుకు ఐఐటీయన్లు ప్రాధాన్యం ఇవ్వాలని నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శనివారం 11వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 884 మంది ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు పట్టాలు అందుకోగా, 282 మంది బీటెక్, 330 మంది ఎంటెక్, 127 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. వీరితో పాటు మాస్టర్ ఆఫ్ డిజైన్స్ 44, ఎమ్మెస్సీ 86, ఎంఫిల్ 8 మంది, ఎంఎస్ రిసెర్చ్ ఏడుగురు విద్యార్థులు పట్టాలు తీసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ మాట్లాడుతూ ప్రస్తుతం భౌగోళిక వాతావరణ మార్పులు, యుద్ధం, విపత్కరమైన రాజకీయ పరిణామాలతో పాటు అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఐఐటీయన్లు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. ఒక విశ్వవిద్యాలయం, ఒక వ్యక్తి ఆలోచన, ఒక ధైర్యమైన చర్య సమాజంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ఐఐటీ పట్టా సాధించిన విద్యార్థులు బాహ్య ప్రపంచంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఐఐటీ నుంచి పట్టా తీసుకున్న విద్యార్థుల దృక్పథం మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఐఐటీ విద్యార్థులు విశాలమైన దృక్పథంతో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందజేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీలు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు.విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ నుంచి 884 మంది విద్యార్థులు పట్టాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండో తరం ఐఐటీల్లో ఐఐటీ హైదరాబాద్ టాప్ 7లో ఉన్నదన్నారు. కరోనా సమయంలోనూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పది బ్యాచ్‌ల విద్యార్థులను విజయవంతంగా గ్య్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
పంకజ్ నిసర్గ్కు రాష్ట్రపతి గోల్డ్ మెడల్
ఐఐటీ హైదరాబాద్ బీటెక్ విద్యార్థి షా నిసర్గ్ పంకజ్‌కు రాష్ట్రపతి గోల్డ్ మెడల్ లభించింది. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పంకజ్ నిసర్గ్ అత్యధిక సీజీపీఏ సాధించాడు. ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ నిసర్గ్కు ఈ మెడల్ ప్రదానంచేశారు. ఎంటెక్‌లో ఆర్.అశ్విన్, ఎమ్మెస్సీలో పీ.ఎస్.కృష్ణేందు, అనురాగ్ చంద్ర శుక్లాలు గోల్డ్‌మెడల్స్ అందుకున్నారు. వీరితోపాటు తొమ్మిది మంది బీటెక్, ముగ్గురు ఎమ్మెస్సీ, 11 మంది ఎంటెక్ విద్యార్థులు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు.
నాన్న కూలీ పనిచేసి చదివించాడు
జహీరాబాద్ మండలం హోతి(బి) గ్రామానికి చెందిన కృష్ణది పేద కుటుంబం. తండ్రి సమ్మప్ప వ్యవసాయ కూలీ. కూలిపనులు చేస్తూ తన ఇద్దరు పిల్లలను చదివించారు. కృష్ణ విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో సాగింది. ఎమ్మెస్సీ నిజాం కళాశాలలో పూర్తిచేశాడు. ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ పూర్తిచేశాడు. శనివారం పీహెచ్డీ పట్టా అందుకున్న అనంతరం తన తండ్రి సమ్మప్పతో సంతోషం పంచుకున్నారు. నా తండ్రి సమ్మప్ప కూలీ చేసి మరి తనను చదివించాడు. ఐఐటీ హైదరాబాద్ నుంచి పీహెచ్డీ పట్టా అందుకోవటం సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులు గర్వించేలా ఉన్నతస్థాయి ఎదగడమే నా లక్ష్యం. నేను గొప్ప సైంటిస్టుగా ఎదుగుతాను. ప్రస్తుతం డీఆర్డీఓలో సైంటిస్టు ఆఫీసర్‌గా పనిచేయనున్నా. – కృష్ణ, హోతి(బి), ఎమ్మెస్సీ, పీహెచ్డీ
నేను స్టార్టప్ పెడతా..
మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన పోలీసు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన నేను ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్నా. క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఫ్లిక్‌కార్ట్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం లభించింది. కొంతకాలం పనిచేసిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నా. అనంతరం స్టార్టప్ కంపెనీ పెట్టాలన్నది నా కల.
– సుదీప్, బీటెక్, జహీరాబాద్
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
బీటెక్ పట్టా తీసుకోవడం సంతోషంగా ఉంది. ఐఐటీ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి ని త్యం విద్యార్థులకు స్ఫూర్తి గా నిలుస్తూ కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని ప్రేరేపిస్తూ ఉంటారు. ఐఐటీ హైదరాబాద్‌లో చదుకోవటం గొప్ప అనుభవం. క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా నాకు మంచి ఉద్యోగం లభించింది. నా దృష్టి అంతా సివిల్ సర్వీస్‌పై ఉంది. కొంతకాలం ఉద్యోగం చేశాక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా. ఐఏఎస్ కావాలన్నది నాలక్ష్యం.
– భాను ప్రకాశ్, బీటెక్, మనుగూరు
సైంటిస్టుగా ఎదగాలని ఉంది
ఐఐటీ హైదరాబాద్ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రొఫెసర్లు, బోధన తీరు చాలా బాగున్నది. ఇక్కడ చదవుకున్న వారు ఎవరైనా ఉన్నత స్థానాలకు ఎదగడం ఖాయం. ఉన్నత విద్యను అభ్యసించి సైంటిస్టుగా ఎదగాలని అనుకుంటున్నా. సైంటిస్టుగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో అనేక ప్రయోగాలు చేయాలని నా కోరిక. నా శాయశక్తులా ప్రజలకు ఉపయోగ పడేందుకు కృషి చేస్తా.
– లాలిత్య, ఎమ్మెస్సీ