సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 1 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ పని చేస్తున్నదని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్‌పై పోలీస్‌శాఖ, సంబంధిత శాఖలకు చెందిన ముస్కాన్ టీంల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఈ ఏడాది 104 మంది బాల కార్మికులను రక్షించామని, వీరిలో 90 మంది బాలురు, 14మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ర్టాలకు చెందిన మరో 15మంది బాల బాలికలను రక్షించమన్నారు. బాలలను కార్మికులుగా పని లో పెట్టుకున్న యజమానులపై 44కేసులు నమో దు చేశామని, 18 ఏండ్ల వయస్సు లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా బాలకార్మికులు ఉన్నైట్లెతే 1098,100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈసమావేశంలో సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వెరొనిక, డీసీపీయూ రత్నం, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కిశోర్, డీసీఆర్బీ సీఐ జలేందర్‌రెడ్డి, ఎస్బీ సీఐ మహేశ్ గౌడ్, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.