సంగారెడ్డి, జూలై 29: పల్లెలు ప్రగతికి చిహ్నాలు.. అలాంటి గ్రామాలను ఆదర్శంగా తీర్చిద్దుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా అభివృద్ధి పనులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిధుల వరద పారిస్తూ ప్రగతికి పెద్దపీట వేస్తున్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చి అభివృద్ధి బాటలు సాగిస్తున్నారు. ఇందుకోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదు విడుతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిధుల వరద పారిస్తున్నారు. దీంతో పల్లెలన్నీ ప్రగతి బాటలో సాగుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తూ స్వచ్ఛ గ్రామాలుగా అవార్డులను సాధిస్తున్నాయి.
2019లో ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఇప్పటి వరకు నిర్వహించిన ఐదు విడతల్లో సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామపంచాయతీలకు గానూ ప్రభుత్వం రూ.441,47,69,494 కోట్లను విడుదల చేసింది. ఆయా నిధులతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 190 గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు విడుతల్లో రూ.100,36,16.095 కోట్లను విడుదల చేసి అభివృద్ధికి బాటలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తూ పల్లెలకు ప్రగతి శోభను తీసుకువస్తున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..
సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి ఫలాలు కనువిందు చేస్తున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు నిర్మాణం, వైకుంఠధామాలు, వంటి పనులు ఎన్నో నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం మురుగు కాల్వల శుభ్రత, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి కార్యక్రమాలను ప్రజలతో కలిసి గ్రామ సభలు నిర్వహించి చేయాల్సిన పనులను గుర్తించి ఆయా పనులు చేపట్టారు. గ్రామ సభలో చేసిన తీర్మాణాలతో ప్రణాళికాబద్ధంగా అవసరమున్న పనులకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల రూపురేఖలను మారుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు ఉన్నత బాధ్యతలను కల్పిస్తూ పల్లెలను ప్రగతి బాటలో పయనింప జేస్తున్నది. ఇందుకోసం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలను అప్పగిస్తూ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆయా గ్రామాల్లోని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. వారు చేస్తున్న పనులతో ఆయా గ్రామాలు అవార్డులు సైతం అందుకుంటున్నాయి. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని చెట్లు దర్శనమిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లోని ఆయా ఇండ్ల ముందు నర్సరీల ద్వారా అందజేసిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతినెలా నిధులు మంజూరు చేస్తూ పంచాయతీలను అభివృద్ధి చేస్తుండడంతో పల్లెలన్నీ ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి.
లక్ష్యం నెరవేరుతున్నది..
పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరుతున్నది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచుల పనితీరు మెరుగు పర్చేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడంతో అభివృద్ధికి మార్గాలుగా నిలుస్తున్నవి. అభివృద్ధితోనే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయని మహాత్ముడు కలలు నిజం చేస్తున్నది తెలంగాణ సర్కార్. ఐదు విడుతల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేశాం. ప్రతినెల ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ పంచాయతీల అభివృద్ధికి పాటుపడుతున్నది.
– సురేశ్మోహన్,జిల్లా పంచాయతీ అధికారి