సంగారెడ్డి, జూలై 29: పంటల సాగులో సాంకేతిక సలహాలు, సహకారంతో కొత్త వంగడాలపై అన్నదాతలకు సలహాలు ఇచ్చి చైతన్యం తీసుకురావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సూచించారు. శుక్రవారం సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని భూసార పరీక్ష కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ నూతన ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్లతో డివిజనల్ వ్యవసాయాధికారి మనోహర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై ఆత్మచైర్మన్కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు నిత్యం సేవలందించేందుకు ప్రభుత్వం 16 క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్‌కో అధికారిని నియమించిందన్నారు. గ్రామానికో డైరెక్టర్‌ను ఏర్పాటు చేసి రైతులు పంటల సాగు కాలంలో భూసారాన్ని బట్టి ఏ పంటలు వేయాలి అనే అంశాలపై అన్నదాతలకు సలహాలు, సూచనలు అధికారులు చేసే విధంగా ఆత్మ కమిటీ పనిచేసి గుర్తింపు తీసుకురావాలన్నారు. సాగులో ప్రపంచానికే తెలంగాణ దిక్సూచీగా నిలిచిందని ప్రభాకర్ స్పష్టంచేశారు. కొత్త రకం పంటల సాగు చేసే ప్రాంతాల సందర్శనకు రైతులను తీసుకెళ్లి నూతన వంగడాలపై అవగాహన కల్పించి మన ప్రాంతంలో సాగు చేసేందుకు ప్రోత్సహించాలని సూచించారు.
అందుబాటులో ఉంటా సేవలందిస్తా…
నియోజకవర్గ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో సేవలందించేందుకు కృషి చేస్తానని ఆత్మ చైర్మన్ కృష్ణాగౌడ్ భరోసా ఇచ్చారు. చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పంటల సాగులో రైతులకు సాంకేతికంగా సలహాలు, సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తామన్నారు. గ్రామాల వారీగా పర్యటిస్తూ రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసేందుకు అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తానన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మాజీ ఆత్మచైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చిల్వరి ప్రభాకర్, బొంగుల రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, విఠల్, ఎంపీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.