సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 19: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేకు సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజూరైన రూ.50 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి, ‘స్వచ్ఛ సంగారెడ్డి’గా తీర్చిదిద్దుకుందామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సండే మార్కెట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. సంగారెడ్డిలో రోడ్లు సరిగా లేవని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కోరారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ సంగారెడ్డికి రూ.50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చారని తెలిపారు. ఆయా నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ సంగారెడ్డిగా మార్చుకోబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా సంగారెడ్డిలో 36 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ వేసి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీరు అందిస్తామని మంత్రి వివరించారు. పట్టణ కౌన్సిలర్లు శ్రద్ధ తీసుకొని నల్లా కనెక్షన్లు ఇప్పించాలని సూచించారు. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు.
సంగారెడ్డి అభివృద్ధికి రూ.50 కోట్ల స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్
సంగారెడ్డిలో రూ.50 కోట్ల స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్‌తో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం పైలన్ ఆవిష్కరించారు. అంతకుముందు రూ.2.90 కోట్లతో స్థానిక బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.1.38 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.15 కోట్లతో నీళ్ల ట్యాంకు, రూ.15 లక్షలతో చింతల్ బస్తీలో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
ప్రతిపక్షాలవి బురద రాజకీయాలు
రాష్ట్రమంతా వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ప్రతిపక్షాలు మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వరదల సమయంలో అడ్డగోలు మాటలేందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి పని చేస్తున్నామని, ప్రతిపక్షాల నాయకులు మాత్రం ఇల్లు కదలడం లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయాల్లో కూర్చొని ప్రెస్మీట్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి వరద సాయం తీసుకురావాలని హితవు పలికారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైనా డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, వచ్చే రెండు నెలల్లో 10 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల
సీఎం కేసీఆర్ సంగారెడ్డికి రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 600 పడకల దవాఖాన అందుబాటులోకి వస్తుందన్నారు. పనులు పూర్తికాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని, సిజేరియన్ సెక్షన్ వల్ల తల్లీబిడ్డలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏండ్ల వయస్సు రాగానే బరువు పెరుగుతారని, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు అవసరం అయితే తప్ప, సిజేరియన్‌కు వెళ్లకూడదని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులను ఆడగాలని మహిళలకు సూచించారు. సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మెరుగైన వైద్యం అందుతున్నదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మ ఒడి వాహన సేవలు అందించి, రూ.13వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదలు ప్రభుత్వ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నప్పటికీ ప్రజల కోసం సీఎం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
సైన్స్ మ్యూజియం సందర్శించిన మంత్రి
అంతకుముందు బైపాస్ రోడ్డులోని సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను పరిశీలించారు. సైన్స్ మ్యూజియం సందర్శనకు వచ్చిన విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇస్రో, ఎన్ఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో వచ్చిన స్పేస్ ఆన్ వీల్స్‌ను మంత్రి సందర్శించారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు.