సంగారెడ్డి కలెక్టరేట్, మే 5: భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూగర్భ జలాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దక్షిణ ప్రాంతానికి చెందిన జలశక్తి విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన జలాశాయ పటాలు, వాటి నిర్వహణ ప్రణాళికలను రాజర్షిషాకు అందజేశారు. జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ, బిందు, తుంపర సేద్యం, ఇం కు డు గుంతలు, వాటర్ షెడ్లు, నీటి కుంటలు వంటి పలు పథకాల ఫలితాలను అధ్యాయనం చేసి భూగర్భ జలాల పెంపుదలకు జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు తెలుపుతూ నివేదిక అందజేశారు. జిల్లాలోని 11 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉన్నదని, అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలంటే ప్రతిఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నారు. ప్రతి ఇంట్లో, పాఠశాలలో ఇంకుడు గుంతలు తవ్వించాలన్నారు. చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. భూగర్భ జలాలు పెరిగే క్రతువులో అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైతుబంధు నిధులతో కూడా నీటి కుంటల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. జిల్లాలో జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద డీఆర్డీవో, అటవీ, నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీరాజ్, విద్య తదితర శాఖలు చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాలు విస్తృతం చేయాలని వివరించారు. ఇంతవరకు సాధించిన ప్రగతిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో అందోల్ మండలంలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, నీటి పారుదల, మైనింగ్, భూగర్భ శాఖల అధికారులు డాక్టర్ సంతోష్ కుమార్, వజీ ఉద్దీన్ పాల్గొన్నారు.
జీవన నైపుణ్యాలే ఉపాధి చూపిస్తాయి
జీవన నైపుణ్యాలే ఉపాధిని చూపిస్తాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. పటాన్‌చెరులోని డిగ్రీ కళాశాలలో రీడ్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసిన ఐటీ, స్కిల్స్, హెల్త్‌కేర్ అంశాలపై ఇచ్చిన శిక్షణ సర్టిఫికెట్లను రాజర్షి షా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీడ్ ఇండియా సంస్థ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు నేర్పుతున్న జీవన నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రతి యువకుడు సర్టిఫికెట్స్ జాబ్స్ ఇస్తాయని భావించకుండా సొంత నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఈడీసీ కోఆర్డినేటర్ వీరేందర్, వైస్ ప్రిన్సిపాల్ అల్లంరెడ్డి, రీడ్ ఇండియా వలంటీర్లు శ్రావణ్‌కుమార్, సత్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మన బస్తీ – మన బడికి ఎంపికైన పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ (బాలికల)ను అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయనతో ఎంఈవో పీపీ రాథోడ్, హెచ్ ఎం రజని, సీఆర్పీ శేషాద్రి, యాదయ్య పాల్గొన్నారు.