సంగారెడ్డి, మే 3: సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయుడు, కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది మహాత్మా బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి 889వ జయంతి వేడుకలు నిర్వహించగా, ఇందులో భాగంగా పట్టణంలోని బైపాస్ రోడ్డులోని అండర్‌పాస్ బ్రిడ్జి ముందు ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి ఎంపీ బీబీపాటిల్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి జడ్పీ చైర్పర్సన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థ, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. చిన్న వయస్సులోనే శైవ పురాణగాథలను అవగతం చేసుకుని, రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ, వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసిన గొప్ప నాయకుడన్నారు. ఆయన బోధనలు ప్రజలను ఆకర్శించి, వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వరస్వామి ఖ్యాతి కర్ణాటక రాష్ట్రం ఎల్లలు దాటి తెలుగు రాష్ర్టాల్లో వ్యాప్తి చెందడం సంతోషకరమన్నారు.
అధికారికంగా జయంతి వేడుకలు..
ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించి వీరశైవ లింగాయత్ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. 12వ శతాబ్దికి ముందు బసవేశ్వరుడు కుల, మతాలకతీతంగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహానీయుడని గుర్తుచేశారు. బసవేశ్వరుని 889 జయంతిని పుసర్కరించుకుని బసవేశ్వరుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ సమాజానికి అవసరమయ్యే పని చేసినప్పుడే గుర్తింపు వస్తుందని, బసవేశ్వరుడు ప్రజల హితం కోసం పాటుపడి గొప్పవ్యక్తిగా అవతరించారని గుర్తుచేశారు. యుతవ ఆయన చూపిన మార్గంలో నడుచుకుని సమాజ నిర్ణేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కంది సర్పంచ్ విమల వీరేశం, వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు శివరాజ్ పాటిల్, సిద్దేశ్వర్, మధుశేఖర్, బస్వరాజ్, చంద్రకాంత్, మేక మల్లేశం, రమేశ్, అనంతయ్య, మల్లికార్జున్, రామప్ప, వైద్యనాథ్, రాందాస్, నర్సింలు, మల్లయ్య, శాంతి కుమార్, కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వసతిగృహ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో…
బసవేశ్వరుడి 889వ జయంతిని పురస్కరించుకుని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, పాండురంగం, సభ్యులు సాయి వరాల, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.