సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మే2: మన ఊరు – మన బడి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మన ఊరు – మన బడి కార్యక్రమంపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పరిపాలన అనుమతులు వేగవంతంగా ఇవ్వాలని, పనుల అంచనాలకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మంజూరు చేయాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తప్పుడు అంచనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులను పూర్తిగా భాగస్వాములను చేయాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించేలా చర్యలు చేపట్టిందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యకు సంబంధించిన పనులు యజ్ఞంలా కొనసాగాలన్నారు. పూర్తయిన పాఠశాలలకు సంబంధించి ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియా పత్రికలు, ఛానల్స్ ద్వారా పెద్దఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.
ఎస్‌ఎంసీల ద్వారా రూ.30లక్షల లోపు పనులు
ఆయా పాఠశాలల్లో చేపట్టే రూ.30 లక్షల లోపు పనులను ఎస్‌ఎంసీల ద్వారా చేయించాలని మంత్రులు స్పష్టంచేశారు. రూ.30 లక్షలకు పైగా ఉన్న పనులకు మే చివరి నాటికి టెండర్లు పూర్తి చేయాలని తెలిపారు. మంజూరీ ఇచ్చిన పనులన్నీ గ్రౌండింగ్ కావాలని వెల్లడించారు. ప్రతి పాఠశాలను సందర్శించి, సంతృప్తి చెందితేనే మంజూరీ ఇవ్వాలని, డబ్బు ఎట్టి పరిస్థితిలోనూ వృథా చేయవద్దని కలెక్టర్లకు సూచించారు. పనుల సంబంధించిన అంచనాలను మరోమారు పరిశీలించాలని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గంలో ఈ నెలాఖరులోగా రెండు పాఠశాలలను పూర్తిచేయాలని ఆదేశించారు. వడగాలులు ఉన్నందున ఇంటర్, పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సబితారెడ్డి సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఎంపిక
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 441 పాఠశాలలు ఎంపిక చేయగా, ఇప్పటి వరకు 275 పాఠశాలలకు పరిపాలనా మంజూరు ఇచ్చినట్లు వివరించారు. అందులో రూ.30లక్షల లోపు 198 పాఠశాలల్లో 60లో పనుల గ్రౌండింగ్ కూడా పూర్తయిందన్నారు. 138 పాఠశాలలు గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గంలో 2 పాఠశాలలు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఈవో రాజేశ్, అధికారులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో 313 పాఠశాలలు గుర్తించాం: కలెక్టర్ హరీశ్
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద మెదక్ జిల్లాలో 313 పాఠశాలలను గుర్తించామని, అందులో 82 పాఠశాలలకు పరిపాలన అనుమతులు ఇచ్చామని కలెక్టర్ హరీశ్ వివరించారు. మిగతా పాఠశాలలకు సంబంధించి తాగునీరు, ఫర్నిచర్ తదితర మౌలిక వసతుల నిమిత్తం వట్టిన అంచనా ప్రతిపాదనలు 10 శాతానికి మించి ఉన్నందున మరోమారు అదనపు కలెక్టర్, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, పది రోజుల్లో ఆమోదం ఇస్తామని తెలిపారు. రూ.30 లక్షల లోపు అంచనా విలువ గల 29 పాఠశాలలను గుర్తించామని, పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. త్వరలో ఆ పాఠశాలల్లో పనులు చేపడుతామని మంత్రులకు వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.