సంగారెడ్డి, ఏప్రిల్ 18: ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని, అందుకు యువకులు ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి, యువకులకు ఉచిత భోజన వసతి కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం అభ్యర్థులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసి పుస్తక ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి, యువకులు కష్టపడి చదివితే ఉద్యోగం సాధిస్తారని ధీమావ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్థలో ఉచితంగా భోజన వసతి కల్పించడం నిరుద్యోగుల అదృష్టమన్నారు. ఉచిత స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాణించాలని మంత్రి అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.