సంగారెడ్డి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. అభయహస్తం లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమచేసుకున్న కార్పస్ ఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించనున్నది. ఆదివారం సంగారెడ్డి కేంద్రంగా అభయహస్తం కార్పస్ ఫండ్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం కార్యక్రమానికి వేదిక కానున్నది. కార్యక్రమంలో 10 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొననున్నారు. అభయహస్తం లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ చేసుకున్న కార్పస్ ఫండ్‌ను తిరిగి చెల్లించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,30,466 మంది లబ్ధిదారులకు మేలు జరుగనున్నది. అభయహస్తం లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ చేసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.
వా రికి కార్పస్ ఫండ్‌ను తిరిగి అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఆదివారం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో కార్పస్ ఫండ్ జమచేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని అభయహస్తం లబ్ధిదారుల ఖాతా వివరాలను ఇది వరకే తీసుకున్నారు. ఈ-కుబేర్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో కార్పస్ ఫండ్ డబ్బును జమ చేయనున్నది. అభయహస్తం పథకం కింద డబ్బులు జమచేసిన డ్వాక్రా మహిళలకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని మంత్రి హరీశ్‌రావు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.543 కోట్ల అభయహస్తం డబ్బులు చెల్లిస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో ప్రారంభం..
2009లో సమైక్య రాష్ట్రంలో అభయహస్తం పథకం ప్రారంభమైంది. ఈ పథకంలో పేరు నమోదుచేసుకున్న మహిళలు 60 ఏండ్ల వయస్సు వచ్చాక ప్రభుత్వం ప్రతినెలా రూ. 500 నుంచి రూ.2వేల వరకు పింఛన్ అందేది. ఈ పథకానికి మహిళా స్వయం సహాయ సంఘాల్లోని 18 నుంచి 59 ఏండ్ల్లలోపు వయసున్న మహిళలు అర్హులు. అభయహస్తం పథకం కింద పేరు నమోదు చేయించుకున్న డ్వాక్రా మహిళల వయస్సును అనుసరించి తమ వాటాగా ఏటా రూ.365 నుంచి రూ.2వేల వరకు చెల్లించారు. ప్రభుత్వం తన వాటాగా అంతేమొత్తాన్ని జమ చేసి బీమా కంపెనీలకు అందజేసేది. సుమారు ఐదేండ్లు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ 60 ఏండ్లు దాటిన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ఆసరా పింఛన్ కింద మొదట ప్రతినెలా రూ.1000, ఆ తర్వాత పిం ఛన్ మొత్తాన్ని రూ. 2016 కు పెంచారు. తాజాగా ప్రభు త్వం ఇటీవల పింఛన్ అర్హత వయస్సును తగ్గించింది. ఆసరా పింఛన్లు వచ్చిన తర్వాత అభయహస్తం పథకం నిలిచిపోయింది. ఈ పథకం నిలిచిపోవడంతో తాము జమచేసిన మొ త్తాన్ని తిరిగి చెల్లించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. సీఎం ఆదేశాల మేరకు డబ్బులను డ్వాక్రా మహిళలకు తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.
స్త్రీనిధి, బ్యాంకుల లింకేజీ చెక్కులు పంపిణీ..
సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో అభయహస్తం డబ్బులు చెల్లింపుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్త్రీనిధి లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. బ్యాంకు లింకేజీ కింద రుణాలు మంజూరైన మహిళలకు చెక్కులు అందజేయనున్నారు. బ్యాంకుల లింకేజీ కింద సంగారెడ్డి జిల్లాలోని 1040 డ్వాక్రా సంఘాలకు రూ.52 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 2100 మహిళా గ్రూపులకు స్త్రీనిధి కింద రూ.20 కోట్లు మంజూరయ్యాయి. డీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. 10వేల మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి మం త్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మ డి మెదక్ జిల్లాలో 2,30,466 మంది లబ్ధిదారులకు మేలు జరుగనున్నది. ఇందులో అభయహస్తం ఎస్సీ లబ్ధిదారులు 58,172, ఎస్టీలు 13,633, బీసీలు 1,38,111, ఓసీలు 13,336, మైనార్టీలు 7214 మంది ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలోని 65,414 మంది లబ్ధిదారులకు లాభం చేకూరనున్నది. సోమవారం నుంచి 65,414 మంది మహిళల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 65,414 మంది లబ్ధిదారుల్లో ఎస్సీ లబ్ధిదారులు 20916 మం ది ఉండగా, ఎస్టీలు 3952 మంది, బీసీలు 33,165, ఓసీలు 3058, మైనార్టీలు 4323 మంది ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో మొత్తం 1,05,535 మంది అభయహస్తం లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఎస్సీ లబ్ధిదారులు 24,314, ఎస్టీలు 5037, బీసీలు 66,345, ఓసీలు 8075, మైనార్టీలు 1764 మంది ఉన్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో మొత్తం అభయహస్తం లబ్ధిదారులు 59,517 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 12,942, ఎస్టీలు 4,644, బీసీలు 38,601, ఓసీలు 2,203, మైనార్టీలు 1127 మంది ఉన్నారు.