అమీన్పూర్, ఏప్రిల్ 14: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నది. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే సంగా రెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, దాయర గ్రామాల పరిధిలో 2017 సంవత్సరంలో అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో 552 ఎకరాల స్థలాన్ని వైద్య పరికరాల తయారీ పరిశ్రమలతో పాటు ఇతర కాలుష్య రహిత పరిశ్రమలకు కేటాయించారు. అందులో 271 ఎకరాలు మెడికల్ డివైజ్ పార్కుకు, మిగితా స్థలంలో పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమల స్థాపనకు, అలాగే మహిళా పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 51ఎకరాలను కేటాయించారు. కాగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 2017జూన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ఆధ్వర్యంలో పారిశ్రామిక ఔత్సాహికులను ఆకట్టుకునేలా ప్రారంభోత్సవ మొదటిరోజే 14 మంది పారిశ్రామివేత్తలకు వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు సుమారు 60ఎకరాలను కేటాయించి ధ్రువపత్రాలను అందజేశారు.
పరిశ్రమల అభివృద్ధి కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దేశంతో పాటు అమెరికా, యూరోపియన్ దేశాల పారిశ్రామివేత్తలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారు. మరికొన్ని నెలల్లోనే మెడికల్ డివైజ్ పార్కులో వివి ధ రకాల పరిశ్రమలు పెద్దఎత్తున నిర్మాణాలు పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘సహజనంద్’ స్టంట్ల పరిశ్రమను ప్రారంభించనున్నారు.
పరిశ్రమల నిర్మాణాల జోరు..
ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సహిస్తుండటంతో అనేకమంది పారిశ్రామివేత్తలు వారికి కేటాయించిన స్థలాల్లో నిర్మాణాల జోరు పెంచారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో మెడికల్ డివైజ్ పార్కుహబ్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పరిశ్రమల స్థాపనకు నిర్మాణాలు చేపట్టారు. ఈ హబ్‌లో ఒకటి, రెండు సంవత్సరా ల్లో దాదాపు నూతన పరిశ్రమల స్థాపన పూర్తి కానున్నదని టీఎస్ఐఐసీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రారంభమైన పరిశ్రమలు..
సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో మొత్తం 20వరకు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అందులో డెక్కన్ ఎంటర్‌ప్రై జెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఐఎస్సీ (యాష్ ప్యాన్స్), ప్రోమియో తెర్ఫాటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు సంబంధించి ఫ్లెక్సడ్ టెక్నోపార్కు ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలతో పాటు ప్రత్యేక మహిళా పారిశ్రామికాభివృద్ధి కోసం ఫిక్కీ మహిళా అసోసియేషన్‌కు 51ఎకరాలను కేటాయించారు. అందులో కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాగా, మరో 25పరిశ్రమల్లో ఉత్పత్తులు సైతం ప్రారంభించారు. దీంతో పాటు చిన్న పరిశ్రమలు నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి.
ఎస్ఎంటీ భారీ పరిశ్రమ ప్రారంభం..
అత్యంత భారీ పరిశ్రమ అయిన (ఎస్ఎంటీ) సహజనంద్ మెడికల్ టెక్నాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో స్టంట్ల ఉత్పత్తి కావడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500నుంచి 2000మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. గుండె వ్యాధి బాధితులకు స్టంట్లు ఇది వరకు లభించే ధర కంటే చాలా తక్కువకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్‌కు ఊపు…
అమీన్పూర్ మండల పరిధిలో మెడికల్ డివైజ్ పార్కు అభివృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్‌కు ఊపునిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఒకేచోట 552ఎరకరాల స్థలాన్ని పరిశ్రమలకు కేటాయించడంతో భూముల కొనుగోళ్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో పరిశ్రమలు పూర్తైతే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో నివాస సముదాయాల రూపకల్పనకు ఇప్పటి నుంచే రియల్ వ్యాపారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
నేడు సుల్తాన్‌పూర్‌కు మంత్రి కేటీఆర్ రాక
మండల పరిధిలోని సుల్తాన్పూర్, దాయర గ్రామా ల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్ డివైజ్ పార్కుకు నేడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. రూ. 250కోట్ల ఏర్పాటు చేసి న ‘సహజనంద్’ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ ఎంటీ) పరిశ్రమలో స్టంట్ల ఉత్పత్తిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ పరిశ్రమలో ఏటా 1.2మిలియన్ల కార్డియాక్ స్టంట్లు, 2మిలియన్ల కార్డియాక్ బెలూన్లు ఉత్పత్తి చేస్తారు. వృద్ధులైన గుండె రోగుల కోసం TAVI, పిల్లలు, గుండె రంధ్రం ఉన్న రోగుల కోసం ఆక్టూడర్ వంటి ఆధునిక సాంకేతిక ఉపయోగించి స్టంట్లు తయారు చేస్తారు. గుండె వ్యాధి బాధితులకు వేసే స్టంట్లు ఇప్పటి వరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో రోగులపై ఆర్థికంగా భారం పడుతున్నది. ఇప్పుడు సహజనంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ ఎంటీ) పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించనుండడంతో తక్కువ ధరకు స్టంట్లు లభిస్తాయి.
తెలంగాణలోనే గొప్ప పారిశ్రామిక హబ్..
తెలంగాణ రాష్ట్రంలోనే సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ గొప్ప పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకుంటున్నది. గ్రేటర్ హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న అ మీన్‌పూర్ మండలంలో కాలుష్య రహిత పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం. సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఇలాంటి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహిస్తున్నా రు. స్థానిక యువతతో పాటు ఇక్కడ ప్రజలకు అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ
మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది
సుల్తాన్పూర్ డివైజ్‌పార్కు అభివృద్ధి చెందడంతో మా నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇక్కడ స్థానిక యువతకు 20శాతం ఉద్యోగాల రిజర్వేషన్ తప్పకుండా లభిస్తున్న ది. అంతేకాకుండా విద్యార్హతలుండి, నైపుణ్యం కలిగిన యువతీ,యువకులకు సైతం ఉన్నతస్థాయి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమ హబ్ పరిసరాలు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది పటాన్చెరు ప్రాంతానికే మరింత పేరు వస్తుంది.
– మహిపాల్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే