సంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని వినియోగదారుల ఫోరం చైర్మన్ దిలీప్‌కుమార్ అన్నారు. రెండేండ్ల విరామం తర్వాత మంగళవారం సంగారెడ్డిలోని విద్యుత్‌శాఖ అతిథి గృహంలో విద్యుత్ ఫోరం ప్రత్యేక కోర్టు నిర్వహించింది. ఫోరం చైర్మన్ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కోర్టులో సభ్యులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగాదారులు తమ సమస్యలను పరిష్కరించాలని దరస్తులు అందజేశారు. పట్టణంలోని ఆరో వార్డుకు చెందిన ఇద్దరు వినియోగదారులు తాము లోవోల్టేజీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని వ్యాపారి గంగాధర్ కోరారు.
చేర్యాలకు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యుత్ మీటర్‌ను వినియోగించటం లేదని, అయినా ప్రతినెలా బిల్లు వస్తుందని, కరెంటు కనెక్షన్ తొలగించాలని కోరినా స్పందించటంలేదని ఫిర్యాదు చేశారు. అలాగే, మోతీలాల్, అనిల్ మాట్లాడుతూ తాము వినియోగించిన విద్యుత్ కంటే అధిక బిల్లులు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులు, ప్రజాకోర్టులకు హాజరుకావాలని వినియోగదారులకు సూచించారు. ఫోరం సభ్యుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకోర్టుపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
19న విద్యుత్ కమిషన్ మెదక్‌కు రాక
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ తెలంగాణ లిమిటెడ్ పరిధిలో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ ఫోరంతోపాటు విద్యుత్ వినియోగదారుల కమిషన్ కూడా పనిచేస్తున్నది. ఫోరం పరిష్కరించలేని సమస్యలను కమిషన్ పరిష్కరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీన కమిషన్ మెదక్ రానున్నది. స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో సమావేశమై వినియోగదారుల సమస్యలను పరిష్కరించనున్నది.