సంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా రైతాం గం కేంద్రంపై కన్నెర్ర చేసింది. సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్రం తీరును నిరసిస్తూ ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, జహీరాబాద్‌లో నాయకులు ర్యాలీలు నిర్వహించారు. అలాగే కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి వారి స్వగ్రామాల్లో సొంత ఇండ్లపై నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం తమ ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి కేంద్రం తీరును ఎండగట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్ధతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో 65వ నంబరు జాతీయ రహదారిని నిర్బందించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యం లో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రైతుల పండించిన వడ్లు కొనకపోతే కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు జిల్లా అంతటా రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో రైతులు తమ ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు.
సంగారెడ్డిలో బైక్ ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ రైతుల పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ తీశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి మొదలైన బైక్ ర్యాలీ పాత బస్టాం డు వరకు కొనసాగింది. అక్కడి నుంచి కొత్త బస్టాండు వద్దకు వచ్చాక కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చింతాప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతులతో చెలగాటం ఆడుతుందన్నారు. పంజాబ్, హర్యా నాలో ధాన్యం సేకరిస్తున్న కేంద్రం ఒక్క తెలంగాణ రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరించటంలేదన్నారు. మోదీ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రైతులకు మద్ధతుగా ఈ నెల 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, విజయేందర్‌రెడ్డి పాల్గొన్నా రు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం దిగొచ్చే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మొయినుద్దీన్, షేక్ ఫరీద్, గుండప్ప పాల్గొన్నారు. జోగిపేటలో మున్సిపల్ చైర్మన్ మల్ల య్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, మార్క్‌ఫెడ్ డైరక్టర్ జగన్మోహన్రెడ్డి తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. నారాయణఖేడ్ మండలం హన్మంతరావుపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. నారాయణఖేడ్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, నారాయణఖేడ్ ఎంపీపీ శాంతిబాయి, జడ్పీటీసీ లక్ష్మీబాయి, సిర్గాపూర్‌లో జడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్‌లో జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఆత్మ చైర్మన్ రాంసింగ్ పాల్గొన్నారు.
నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తుందని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆరోపించారు. శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో ద్విచక్రవాహనాలతో మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాల వల్ల తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తూప్రాన్, నర్సాపూర్ నియోజకవర్గాలోని అన్ని గ్రామాల్లో ఇండ్లపై నల్లజెండాలు ఎగరేసి, నిరసన ర్యాలీలు నిర్వహించారు.