సంగారెడ్డి, ఏప్రిల్8: బండి సంజయ్‌కు దమ్ముంటే ధాన్యం కొనిపించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్నా, కేంద్రం దిగిరాకపోవడంతో టీఆర్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం ఊరూరా నల్లా జెండాలతో నిరసనలు తెలిపారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్ నుంచి కొత్త బస్టాండ్ ఎదుట ఉన్న రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నల్లాజెండాలతో నిరసన తెలుపుతూ రైతులు తమ ఇండ్లపై జెండాలు కట్టి నిరసనలు తెలిపారు. సదాశివపేట, కొండాపూర్, కంది మండల కేంద్రాలతో పాటు సంగారెడ్డిలో నల్లాజెండాలతో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమాలు టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు.
ఈ నెల 14 బండి సంజయ్ తలపెట్టిన యాత్రను గ్రామగ్రామాన అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, వారికి సమాధానం చెప్పిన తర్వాతే యాత్ర మొదలు పెట్టలని డిమాండ్ చేశారు. ఒకే దేశం-ఒకే కొనుగోలు విధానంతో ప్రజలను కేంద్ర ప్రభుత్వం మభ్యపెడుతున్నదన్నారు. వెంటనే తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే అన్నదాత ఆదర్శంగా ఉండాలనే తపనతో సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం కన్ను కుట్టి యాసంగి పంటను కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను అభాసుపాలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలని బండికి సూచించారు. ఈ నిరసనలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్ (నాని), విష్ణువర్ధన్, అశ్విన్, శ్రీకాంత్, సోహైల్ అలీ, పవన్ నాయక్, డైరెక్టర్ జైపాల్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింహులు, విజయేందర్‌రెడ్డి, బొంగుల రవి, జీవీ శ్రీనివాస్ చక్రపాణి. శ్రీనివాస్ ముదిరాజ్, బత్తుల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రావన్‌రెడ్డి, వాజీద్, జలేందర్ పాల్గొన్నారు.