సంగారెడ్డి, ఏప్రిల్7: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రోజు కూలీకి భరోసా కల్పించింది. ప్రభుత్వం అందజేస్తున్న కూలి తీసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు కూలీలు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటే, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పొట్టపోసుకునేందుకు కూలీలు ఎండనకా, వాననకా వా తావరణ పరిస్థితులను పట్టించుకోకుండా పని చేస్తున్నా రు. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం ఉదయం పూటనే పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. కూలీలకు రెండుపూటలు కడుపునిండా భోజనం అందించాలని కూలి రేట్లు రూ.257లకు పెంచింది. ఇప్పటి వరకు రోజు వారి కూలి రూ.249లు చెల్లిస్తున్న అధికారులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు రూ.257లు చెల్లించనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో వేసవిలో ఉపాధి పనులు అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
దీంతో జిల్లాలో 2,53.050 లక్షల జాబ్‌కార్డుల్లో కూలీలుగా నమోదు చేసుకున్న కుటుంబాలు పనికి వెళ్లే అవకాశాన్ని కల్పించింది. దీంతో 1.09లక్షల కుటుంబాల్లోని 2,62,948 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్నారు. వీరందరికీ 54.14 లక్షల పనిదినాలను అధికారులు కల్పించారు. 12,560 కుటుంబాలకు 100 రోజులు పనిదినాలు కల్పించి కుటుంబాలకు ఉపాధిహామీ పథకం అండగా నిలిచింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.124,42,61,000 నిధులు ఖర్చు చేసింది. కూలీలకు రూ.82,18,64,000 లను కూలీ చెల్లించారు. కూలి పనుల్లో ఉపయోగించే సామగ్రికి రూ.37,49,65,000, పరిపాలనాకు రూ.4.58 లక్షలను అధికారులు ఖర్చు చేశారు. వేసవి కాలంలో ప్రారంభమైన పనుల్లో రోజు వారీగా కూలీల సంఖ్య పెరగవచ్చని ఉపాధి హామీ పథకం అధికారులు స్పష్టం చేశారు. జిల్లా 2,53,050 జాబ్‌కార్డుల్లో నమోదు చేసుకున్న కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి పెంచిన కూలి పొందేందుకు అవకాశం ఉండడంతో జాబ్‌కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
రూ.257కు పెరిగిన కూలి..
జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేస్తున్న కూలీలందరికీ సమాన వేతనంతో పాటు వసతులతో పాటు పని కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 31, 2021 వరకు గతంలో అమలు చేసిన కూలి రూ.249 నుంచి రూ. 257కు పెంచడంతో కూలీలకు అదనంగా 8 రూపాయలు అందుకోనున్నారు. అందుకోసం కూలీలకు పని ప్రదేశంలో నీటి వసతి కల్పించేందుకు రూ. 5, గడ్డపార సానబట్టేందుకు రూ.2చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్నది. కూలీలందరికీ నీళ్లు, గడ్డపార కూలి ఉండదని, కేవలం గడ్డపార సానబెట్టినా, నీటి వసతి ఏర్పాటు చేసిన కూలీలకు మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర గ్రామీణ శాఖ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కూలి పెంచకున్న తెలంగాణలో మాత్రం రూ.257కు పెరిగింది. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో తలపెట్టిన ఉపాధిహామీ పథకంలో కూలీలందరికీ చేతినిండా పని కల్పిస్తూ అండగా నిలుస్తున్నది తెలంగాణ సర్కార్.
కొలతల ప్రకారం పని చేయాలి..
ఉపాధి పథకంలో రోజు వారీగా కూలి పనికి వెళ్తున్న వారందరికీ అధికారుల లెక్కల ప్రకారం పని చేస్తే పూర్తి కూలీ వస్తుంది. వారంలో చేయాల్సిన పనిని కొలతల ప్రకారం ఐదు రోజుల్లో పూర్తిచేసినా పనికి పూర్తి కూలి అందనున్నది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూలీలు వడదెబ్బ బారిన పడకుండా నీటి వసతి కల్పించేందుకు రూ.5లు, గడ్డపార సానబెట్టేందుకు రూ.2 చొప్పున ప్రభుత్వం కేటాయిస్తున్నది. వేసవిలో చెట్లు లేని ప్రాంతాల్లో పని చేసే కూలీలకు, వారి పిల్లలకు నీడ ఉండేందుకు షామియానాలు అందిస్తున్నది. కూలీలు ఎలాంటి ఇబ్బంది పడకుండా తమ పనిని సమయానికంటే అదనంగా చేస్తే అదనపు కూలి లభిస్తుంది. ఈ విషయాన్ని గమనించి కూలీలందరూ సమయస్ఫూర్తితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలిగి సంతోషంగా ఉంటారు.
– శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో పీడీ , సంగారెడ్డి