సంగారెడ్డి ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : రైతుల వెన్నంటే సీఎం కేసీఆర్ ఉన్నారని, కేంద్రం ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు మోదీ సర్కార్‌పై టీఆర్ఎస్ పోరాటం చేస్తదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి టీఎస్‌ఐఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్రనాయకులు దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నదన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనన్నారు. ఇదే విషయమై రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి గోయల్‌ను కలిస్తే తెలంగాణ రైతులను కించపరిచేలా మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పటం ఖాయమన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా మోదీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కన్నెర్రచేస్తే బీజేపీ గద్దె దిగటం ఖాయమన్నారు. కేంద్రం వందశాతం ధాన్యం కొనుగోలు చేయాలని, అప్పటి వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మిషన్‌కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందజేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రైతుల కోసం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రైతులు వెన్నంటే ఉన్నారని, ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. అందో లు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ మోదీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవీ చేయటం లేదన్నారు. తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతు న్నా ధాన్యం కొనుగోలుకు ముందుకురావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరిసాగు చేస్తే ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తమది అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఇప్పుడు నోరుమెదపటం లేదన్నారు. శుక్రవారం రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేయాలని కోరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు రైతులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయకుండా వారి భవిష్యత్‌తో చెలగాటం ఆడుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. టీఎస్యంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆయన నాయకత్వంలో కేంద్రం మెడలు వంచటం ఖాయమన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచన మేరకు యాసంగిలో రైతులు వరి సాగు తగ్గించినట్లు తెలిపారు. వరి సాగు తగ్గినా ధాన్యం కొనుగోలు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.