సంగారెడ్డి, ఏప్రిల్ 7: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు కళాకారుల బృందం తెలంగాణ పాటలతో అలరించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ చేస్తున్న కుట్రను చూపించేందుకు రైతులు ధాన్యం కంకులతో ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చింతాప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఒకే దేశం-ఒకే విధానం అంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యంపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల జోలికి వస్తే ఉద్యమాలతో కేంద్రం గద్దెను కదిలించే శక్తి ఉందని, ఈ విషయం తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడే బీజేపీ నాయకులు తెలుసుకోలేరా అని చురకలంటించారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ వడ్లను కొనుగోలు చేసేంత వరకు ఉద్యమాలు చేస్తామన్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రంతో కొనిపించాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతికిరణ్, బేవరేజస్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు కొండల్‌రెడ్డి, పద్మావతి పాండురంగం, రాజురాథోడ్, ఎంపీపీలు మనోజ్‌రెడ్డి, సరళపుల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణాల అధ్యక్ష, కార్యదర్శులు చక్రపాణి, మధుసూదన్‌రెడ్డి, విఠల్, ఆంజనేయులు, శ్రీనివాస్‌ముదిరాజ్, సాయాగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, ఆరీఫ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ జోలికి వస్తే మరో ఉద్యమం..
బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులతో ఆటలాడుతున్నదని తెలంగాణ ప్రజల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి హెచ్చరించారు. ఒకే దేశం-ఒకే ప్రజలు- ఒకే చట్టం అనే విధానాలతో గద్దెనెక్కిన కేంద్ర సర్కార్ యాసంగి పంటను సేకరించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నదని ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలపై పంజాబ్ రైతులు ఏడాది పాటు దీక్షలు చేయడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తీసుకున్నా పంజాబ్‌లో బీజేపీని బొందపెట్టారని గుర్తు చేశారు.
– నరహరిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఢిల్లీకి వస్తం.. భరతం పడతాం..
తెలంగాణ అన్నదాతలను అతలాకుతలం చేస్తూ ఆటలాడుకుంటున్న కేంద్రంపై తిరుగుబాటు చేసి ధాన్యం కొనుగోలు చేయిస్తామని, ఢిల్లీకి వచ్చి బీజేపీ భరతం పడతామని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణి క్యం హెచ్చరించారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తలొదిక్కుగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తూ కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధాన్యం సేకరణకు ఆదేశాలు జారీ చేసి యాసంగి ధాన్యాన్ని కేంద్రం ఎఫ్‌సీఐతో కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
– పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
టీఆర్ఎస్ను బద్నాం చేసేందుకే బీజేపీ కుట్ర
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికీ నేరుగా అందుతుండటంతో కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణను విచ్చినం చేసేందుకు కుట్ర చేస్తున్నదని సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ ఆయిల్ పంటను ప్రోత్సాహించి నూనె ధరలు తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం ప్రభుత్వం ఫామ్ ఆయిల్‌కు మద్ధతు ధర ప్రకటించడంలో విఫలమైందన్నారు. రైతులపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం పక్షాన నిలిచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయించాలన్నారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నీటిని జిల్లా అవసరాలకు వినియోగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్య లు తీసుకోవడంతో తాగు, సాగు నీటికి కొరత లేకుండా అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణకే దక్కిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు కుట్ర చేస్తూ యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్నారని, రైతుల ఆగ్రహానికి గురికాకముందే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని సూచించారు.
– కాసాల బుచ్చిరెడి, సీడీసీ చైర్మన్
మాట నిలబెట్టుకోవాలి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యా సంగిలో వరి పంటను వేయొద్దని, కేంద్రం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్నదని సూచించినా కొన్ని ప్రాంతా ల్లో ప్రధాన పంటగా వరి కావడంతో సాగు చేశారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ అన్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో వరిసాగు చేయాలని తొడలు చరిచి మాట ఇచ్చిన బండి సంజయ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక మాట… గల్లీలో మరో మాట చెబుతూ బీజేపీ నాయకుల ఆందోళనలకు కారణమయ్యారని, యాసంగి ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
– నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్