జహీరాబాద్, ఏప్రిల్ 5 : జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్)కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు రావడంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం వేగం పెంచింది. ప్రపంచ దేశాల వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెటేందుకు ముందుకు రావడంతో భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. నిమ్జ్ ఏర్పాటుకు ప్రభు త్వం రైతుల నుంచి 12,635 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొదటి విడుత ప్రభు త్వం 3501 ఎకరాలను సేకరించింది. నిమ్జ్ ఏర్పాటు కోసం జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రైతుల నుంచి భూములను తీసుకుంటుంది. న్యాల్కల్ మండలంలోని ముంగ్గి, రుక్మాపూర్, రుక్మాపూర్ తండా రైతుల భూములను సేకరించారు. ఝరాసంగం మండలంలోని బర్థీపూర్, ఎల్గొయి, చిలేపల్లి, గ్రామాల రైతుల భూములు ప్రభుత్వం మొదటి విడుత సేకరించి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది.
‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. నిమ్జ్‌లో భూముల అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయించేందుకు, పెట్టుబడిదారులు పరిశ్రమలు నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు మంజూరు చేయగా, కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం ‘టీఎస్ఐఐసీ’ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్ర ప్రభు త్వ లేవనెత్తిన అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రీన్‌బెల్ట్ ఏరియా నిర్వహణ, వ్యర్థజలాలు, శుద్ధప్లాంటు, బఫర్‌జోన్ నిర్వహణ, కేటగిరీ పరిశ్రమలను ఒకేచోట ఏర్పాటు చేయడంతో పాటు సమీప గ్రామాలకు కనీసం 500,700 మీటర్లు దూరంగా ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో వివరించారు. నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.13,300 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.60,000 కోట్లు పెట్టుబడుల వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం అంచనా వేసింది. నిమ్జ్‌లో 2.77 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయిని ప్రభుత్వం ప్రకటించింది.
నిమ్జ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలు
నిమ్జ్‌లో విద్యుత్తు పరికరాలు, మెటల్స్, ఆహా ర, వ్యవసాయ, ఉత్పత్తుల శుద్ధి, నామ్ మెటాలిక్ మినరల్స్ (గ్లాస్ కాకుండా), ఆటోమొబైల్, మెషినరీ, ఎలక్ట్రానిక్స్, రవాణా పరిశ్రమలకు భూము లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్జ్ ఏర్పాటు చేసే జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, ట్రైడెంట్ షుగర్స్, దిగ్వాల్ శివారులో ఫార్మా కంపెనీల పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్, టైటాన్‌తో పాటు పలు పరిశ్రమలకు భూములు కేటాయించింది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్), ఎన్ఐసీడీసీ (నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది.
ఏర్ షిప్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు..
నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులకు ప్రత్యేక ఏర్ షిఫ్ట్ నిర్మాణానికి ప్రభు త్వం కేంద్రానికి నివేదిక సమర్పించిందని అధికారులు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పలు దేశాలకు చెందిన వ్యాపారులు నేరుగా వచ్చేందుకు ఏర్ షిష్ట్ నిర్మించాలని ప్రభు త్వం భావిస్తున్నది. పలు పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని, నిమ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
రైల్వే లైన్, 65వ జాతీయ రహదారి పక్కన నిమ్జ్ ఏర్పాటు 
65వ జాతీయ రహదారి నుంచి నేరుగా నిమ్జ్‌కు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా గ్రీన్ బెల్ట్ రోడ్డుకు భూమి సేకరిస్తున్నది. జాతీయ రహదారిపై హుగ్గెల్లి చౌరస్తా నుంచి నేరుగా నిమ్జ్ ఏర్పాటు చేసే బర్థీపూర్-ఎల్గొయి శివారులోనికి వాహనాలు వెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వ్యాపారులు పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను రవాణా చేసేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణం చేస్తున్నారు. ముడి సరుకు, ఉత్పత్తి చేసిన వస్తువులు రవాణా చేసేందుకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేశారు. జహీరాబాద్-బీదర్ రైల్వే లైన్‌కు మధ్యలో మెటల్‌కుంట శివారు నుంచి నిమ్జ్‌కు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం సర్వే చేసి నివేదిక సిద్ధం చేసింది. ఉత్పత్తి చేసిన వాటిని నేరుగా ఇతర దేశాలు, రాష్ర్టాలకు తరలించేందుకు రోడ్డు, రైల్వే లైన్లు నిర్మాణానికి భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు నిమ్జ్‌కు సమీపంలో ముంబయి-మచిలీపట్నం జాతీయ రహదారి, సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారి ఉంది. శంషాబాద్, బీదర్ ఎయిట్పోర్టులతో పాటు 600 కిలోమీటర్లు దూరంలో కృష్ణపట్నం సీపోర్టు ఉంది. నిమ్జ్‌కు మధ్య నుంచి జహీరాబాద్-బీదర్-నాందేడ్ రోడ్డు మార్గం ఉంది.
భూ సేకరణకు రూ.190 కోట్లు చెల్లింపు..
నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రైతుల వద్ద భూములు సేకరించేందుకు మొదటి విడుత రూ.190 కోట్లు చెల్లిచింది. మొదటి విడుత న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ముంగి, రూక్మాపూర్, రూక్మాపూర్తండా, బుర్థీపూర్, చిలేపల్లి, ఎల్గొయి గ్రామాల్లో భూములు సేకరించి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి విడుత 3501 ఎకరాల భూమిని సేకరించింది. సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 
నిమ్జ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అధికారులు భూములు సర్వే చేశారు. రోడ్లు, నీటి సౌకర్యం, విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యాపారులకు భూములు (ప్లాట్లు కేటాయించేందు)కు ఏర్పాట్లు చేస్తున్నది. నిమ్జ్‌లో ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారులు పెట్టుబడులు పెటేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిమ్జ్‌లో గుండు సూది నుంచి విమానాలు తయారు చేసే పరికరాల పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నది. ఝరాసంగం మండలంలోని బర్థీపూర్ శివారులో ఉన్న చౌరస్తాను ప్రధాన కేంద్రంగా నిమ్జ్ పనులు చేసేందుకు టీఎస్ఐఐసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు కృషి
రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్‌లో కాలుష్యం లేని పరిశ్రమలు స్థాపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నిమ్జ్‌కు సమీపంలో మంజీరా నది ఉండడంతో ప్రభుత్వం కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. నిమ్జ్ 13 కిలోమీటర్లు దూరంలోనే మంజీరా నది ఉంది. నిమ్జ్ నీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.