సంగారెడ్డి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకం అమలు మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 31 లోగా దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేసేదిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ దళితులు ఆర్థిక స్వాలంబన సాధించే వీలుగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ఎంపికైన లబ్ధిదారులకు స్కీం పత్రాలను అందజేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తయ్యింది. అందోలు నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఈ నెల 30, 31 తేదీల్లో దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేయనున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు జిల్లాలో లబ్ధిదారులకు పత్రాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 444 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు.
అందోలు నియోజకవర్గం వట్పల్లి మండలంలోని బుడ్డాయిపల్లిలో 44 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ రెండు రోజుల క్రితం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అలాగే, మినీ డెయిరీ ఏర్పాటుకు వీలుగా షెడ్ నిర్మాణం పనులను ప్రారంభించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రుద్రార్ గ్రామంలో 95, మహాదేవ్పల్లిలో ఐదుమంది లబ్ధిదారులకు చెక్కులు, వాహనాలను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ అందజేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కంది మండలం బేగంపేట, ఉత్తర్పల్లి, సదాశివపేట మండలం గొల్లగూడెంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో లబ్ధిదారులకు చెక్కులు, వాహనాలను అందజేయనున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అంతారం, కొడకంచి, బచ్చుగూడ గ్రామాల్లో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 31న లబ్ధిదారులను చెక్కులు, వాహనాలను అందజేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దళితబంధు పథకం కింద మినీ డెయిరీ ఏర్పాటుకు వీలుగా పశువుల షెడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు త్వరలోనే చెక్కులు, వాహనాలను అందజేయనున్నారు.
మినీ డెయిరీల ఏర్పాటుకు లబ్ధిదారుల ఆసక్తి
దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఎక్కువగా మినీ డెయిరీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం లబ్ధిదారులు మినీ డెయిరీ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో మినీ డెయిరీలు దళితబంధు లబ్ధిదారులకు లాభసాటిగా మారుతాయని అధికారులు చెబుతున్నారు. రెండెకరాల భూమి ఉన్న దళితబంధు లబ్ధిదారులు మినీ డెయిరీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. రూ.10 లక్షలతో ఆవులు, బర్రెల కొనుగోలుకు అధికారులు అనుమతిస్తున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల పర్యవేక్షణలో బర్రెలు, ఆవులు కొనుగోలు జరిగేలా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈజీఎస్ ద్వారా మినీ డెయిరీ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు పశువుల షెడ్ నిర్మించి ఇస్తున్నారు. దళితబంధు లబ్ధిదారుల నుంచి విజయ డెయిరీ పాలు సేకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అం దోలు నియోజకవర్గంలో 20 మంది, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 33 మంది, పటాన్చెరులో 32 మంది, సంగారెడ్డిలో 26 మంది, జహీరాబాద్ నియోజకవర్గంలో 35 మంది లబ్ధిదారులు మినీ డెయిరీలు ఏర్పాటు చేసుకోనున్నారు. మినీ డెయిరీల తర్వాత లబ్ధిదారులు ట్రాన్స్‌పోర్టు వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అందోలు నియోజకవర్గంలో ముగ్గురు, నారాయణఖేడ్‌లో 24 మంది, పటాన్చెరులో 20, సంగారెడ్డిలో 14, జహీరాబాద్‌లో 19 మంది లబ్ధిదారులు గూడ్స్ వాహనాలు తీసుకుంటున్నారు.
ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్న వారిలో అందోలు నియోజకవర్గంలో ఇద్దరు లబ్ధిదారులు, నారాయణఖేడ్‌లో 9 మంది, సంగారెడ్డిలో ముగ్గురు, జహీరాబాద్‌లో 11 మంది ఉన్నారు. ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలుకు అందోలు నియోజకవర్గంలో నలుగురు, నారాయణఖేడ్‌లో ఒకరు, పటాన్చెరు నియోజకవర్గంలో 11 మంది, సంగారెడ్డిలో ముగ్గురు లబ్ధిదారులు ముందుకువచ్చారు. సెంట్రింగ్, ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్ల ఏర్పాటుకు అందోలు నియోజకవర్గంలో ఒకరు, నారాయణఖేడ్‌లో 12, పటాన్చెరులో 5 మంది, సంగారెడ్డిలో నలుగురు, జహీరాబాద్ నియోజకవర్గంలో ముగ్గురు ఆసక్తి చూపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఆరుగురు లబ్ధిదారులు క్లాత్ ఎంపోరియం పెట్టుకోనుండగా, జహీరాబాద్‌లో ఇద్దరు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇద్దరు, పటాన్చెరులో ఒకరు ముందుకువచ్చారు. పౌల్ట్రీ ఫారాలు పెట్టుకునేందుకు పటాన్చెరు నియోజకవర్గంలో ఆరుగురు, సంగారెడ్డి నియోజకవర్గంలో ఆరుగురు, జహీరాబాద్ నియోజకవర్గంలో 15 మంది లబ్ధిదారులు ముందుకువచ్చారు. కాఫీడే వ్యాపారం చేసుకునేందుకు సంగారెడ్డిలో ఒక లబ్ధిదారుడు ఆసక్తి చూపాడు. ఇద్దరు నుంచి నలుగురు లబ్ధిదారులు కలిసి జేసీబీ వాహనాలు, ఆయిల్ మిల్లులు, వాటర్ప్లాంట్లు ఏర్పా టు చేసుకునేందుకు ముందుకువచ్చారు. మహిళా లబ్ధిదారులు బ్యూటీపార్లర్, బొటీక్, లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోనున్నారు.సంగారెడ్డి జిల్లాలోని 444 మంది లబ్ధిదారులు లాభసాటి వ్యాపారాలు ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటున్నారు.
31లోగా గ్రౌండింగ్ పూర్తి
సంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకం కింద 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశాం. అందోలు నియోజకవర్గం కొన్ని మండలాలు మెదక్ జిల్లాలో ఉండడంతో 44 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో దళితబంధు గ్రౌం డింగ్ ప్రారంభమైంది. ఈ నెల 30, 31 తేదీల్లో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేస్తాం. ఈ నెల 31 లోగా వందశాతం దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేస్తాం.
-బాబూరావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్