సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 11: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో నూతనోత్సాహం నిండింది. వేలాది పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానుండడంతో నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు ఇతర పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లో శిక్షణకు సిద్ధమవుతున్నారు.
చిగురించిన కొత్త ఆశలు
ఉద్యోగ ప్రకటన ఎప్పుడొస్తుందా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తమ సామర్థ్యాలను పరీక్షించుకుని సర్కారు నౌకరీ సాధించాలనుకుంటున్నారు. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దీంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
60 వేలకు పైగానే అభ్యర్థులు
సంగారెడ్డి, మెదక్ జిల్లాలు కలిపి 60 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉందని ఒక అంచనా. ఇప్పటికే ఎంతో మంది పరీక్షలకు సిద్ధమవుతుండగా, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా మూతబడ్డ కోచింగ్ సెంటర్లు పునఃప్రారంభమయ్యాయి. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మెదక్, సంగారెడ్డిలోని కోచింగ్ సంస్థల్లో ఉత్తమ ఫ్యాకల్టీ, డైలీ టెస్ట్‌ల నిర్వహణ, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇస్తున్న వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు ఎక్కువ ఫీజు చెల్లించి మరీ నాణ్యమైన కోచింగ్ సెంటర్లలోనే చేరుతున్నారు. మరింత మెరుగైన శిక్షణ పొందాలనుకునే వారు హైదరాబాద్ వెళ్తున్నారు.
జోనల్ విధానంతో స్థానికులకే అవకాశం..
కొత్త జోనల్ విధానంతో మన జిల్లాలో ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. దీంతో నిరుద్యోగులకు న్యాయం జరుగనున్నది. నిరుద్యోగ యువత ఆకాంక్షలను సీఎం గుర్తించడంతో స్థానికులే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడిండి.
వయోపరిమితి పెంపుపై హర్షం..
ప్రభుత్వ నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు సీఎం మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతరాత్ర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏండ్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్లయింది. ఈ నిర్ణయంతో ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయోపరిమితిని పెంచడంతో మెదక్ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు మరో అవకాశం వచ్చినట్లయ్యింది.
మెదక్ జిల్లాలో 1,149 ఖాళీలు
మెదక్ జిల్లాలో 1149 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ జిల్లా రాజన్న జోన్-3 లోకి వస్తుంది. ఈ జోన్లో 2,403 పోస్టులు ప్రకటించారు. జిల్లాలో ప్రస్తుతం 6,366 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 5,572 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు.
ఉచిత శిక్షణతో పాటు మధ్యాహ్న భోజనం..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. గతంలో పోలీసు ఉద్యోగాల కోసం 3 పర్యాయాలు భోజనంతో కూడిన ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంతో మంది ఉచిత శిక్షణ తీసుకుని ఉద్యోగులు సంపాదించారు. త్వరలోనే కేంద్రాలు ప్రారంభిస్తాం. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు
సాధించాలి.
– పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
ఉచిత శిక్షణ అభినందనీయం
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపడం సంతోషకరం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి నియోజకవర్గ కేంద్రాల్లో ఉచితంగా కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించడం అభినందనీయం. దీంతో పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది.
– మమత, ప్రైవేట్ అధ్యాపకురాలు, తారకరామనగర్, మెదక్
పుస్తకాల ఎంపిక చాలా ముఖ్యం
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే పుస్తకాల ఎంపిక చాలా ముఖ్యం. 80వేలకు పైగా ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగులు ప్రధానంగా పాఠ్యపుస్తకాలు చదవాలి. పుస్తకాలతో పాటు వార్తా పేపర్లు చదవాలి. కష్టపడి చదివితేనే అనుకున్నది సాధించగలుగుతాం.
– వెంకట్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి, కోహీర్
నిరుద్యోగుల కల సాకారం..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. భారీఎత్తున ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వయోపరిమితి పెంచడం, స్థానికులకే 95 శాతం అవకాశం కల్పించడం సంతోషకరం. కాంట్రాక్టు ఉద్యోగులకు వరంలాంటిది.
– వాజిద్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, కోహీర్