మెరుగైన ఫలితాలు ఆ పాఠశాల సొంతం. అక్కడి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం రాష్ర్టానికే ఆదర్శంగా పాఠశాలను నిలబెట్టింది. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఆ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యనభ్యసించేందుకు ‘మన ఊరు-మన బడి’కి తొలివిడుతలో ఎంపికయ్యింది సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల. మరిన్ని వసతులు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సిద్ధం చేయనుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన విద్య, వసతులతో వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని టీచర్లు చెబుతున్నారు.
సంగారెడ్డి, మార్చి 11: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది. సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా ఏండ్ల క్రితం నిర్మించిన పాఠశాలల గదులు శిథిలావస్థకు చేరుకుని విద్యావ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాలల తీరును గుర్తించిన సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలకు కొత్తరూపు అందించనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’కి తొలి విడుతలో ఎంపిక చేయడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 13 గదులు, 9 మంది ఉపాధ్యాయులు, 574 మంది విద్యార్థులతో పాఠశాలలో మెరుగైన ఉత్తీర్ణత శాతంతో ఫలితాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు. బాల, బాలికలకు మరుగుదొడ్లు 8, మూత్రశాలలు 20 అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
పాఠశాల ప్రాంగణం హరితవనం..
ప్రభుత్వం హరితహారంలో ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో హరితహారంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటడంతో పచ్చని చెట్లతో ఆహ్లాదం సంతరించుకున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మరిన్ని వసతులు కల్పిస్తే ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు.
ఇంటర్నెట్, వైఫై సౌకర్యం..
అరకొర వసతులతో ప్రభుత్వ బడులు నెట్టుకు వచ్చే పరిస్థితికి సీఎం కేసీఆర్ స్వస్తి పలికారు. అందుకే పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు కల్పించి కంప్యూటర్ విద్యనందిస్తున్నది. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీటి వసతికి బోర్వెల్, విద్యుత్, 3-ప్రొజెక్టర్స్, 2- స్మార్ట్ తరగతులు, కీ బోర్డులు, 140 ఫర్నిచర్ బెంచీలతో సౌకర్యాలు కల్పించారు.
అదనపు గదులు, ఉపాధ్యాయులు ఏర్పాటు..
ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, టీచర్లు, వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న గదులకు అదనంగా 9 గదులు, 7 మంది ఉపాధ్యాయులు, ఒక క్లర్క్, వాచ్మెన్, మరుగుదొడ్ల క్లీనర్, స్వీపర్లు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. విద్యార్థులకు సరిపడా 120 ఫర్నిచర్ బెంచీలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇంగ్లిష్‌లో మాట్లాడడం పెరిగింది..
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సులువైంది. మాలాంటి పేద విద్యార్థులకు సర్కారే అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం. పేద పిల్లల కోసం సీఎం సార్ తీసుకున్న నిర్ణయం మంచిగా ఉన్నది.
– శివలీల, 10 వ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థినీ
పేద విద్యార్థులకు వరం…
ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు వరంగా మారనున్నది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి. అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారు పేద విద్యార్థులే ఉంటారు. ఫలితాల్లో మాత్రం ప్రైవేట్‌ను మించి సాధించడం సంతోషంగా ఉన్నది.
– నిఖిత, 10 తరగతి తెలుగు మీడియం విద్యార్థినీ
వచ్చే ఏడాదిలో ప్రవేశాలు పెరుగుతాయి…
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడాదిలో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’తో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాలలో ప్రైవేట్‌ను మించి ఉత్తీర్ణత సాధించి ముందంజలో ఉన్నది. ఈ నూతన పథకంతో మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు కానున్నాయి.
– జాకీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయుడు పోతిరెడ్డిపల్లి