హత్నూర, మార్చి 5: మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, దీన్ని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం హత్నూరలో నిర్వహించిన మహిళా విజయోత్సవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు రూ.12,400 కోట్ల రుణాలు అందజేశామన్నారు. వాటితో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలిపారు. మహిళా భవనంలో ఫర్నిచర్ కోసం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.25వేలు, ఎంపీపీ నర్సింహులు రూ.25వేలు, జడ్పీటీసీ ఆంజనేయులు రూ.25వేలు విరాళంగా ప్రకటించారు. అనంతరం చైర్‌పర్సన్‌ను మహిళలు సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మన ఊరు- మనబడితో నాణ్యమైన విద్య
మన ఊరు-మన బడితో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బోర్పట్లలో మన ఊరు- మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కారు బడులను బాగు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆంగ్లమాధ్యమంలో ఉన్నత విద్యనందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించాలని కోరారు. హత్నూరకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి తల్లి మృతి చెందడంతో బాధిత కుటుంబీకులను ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్పర్సన్, తదితరులు పరామర్శించారు.