Damodara Rajanarsimha | మునిపల్లి, అక్టోబర్ 21: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై సంగారెడ్డి జిల్లా మునిపల్లి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారికి మా లింగంపల్లి గురుకుల పాఠశాల గుర్తుందా? గుర్తు చేయాలా అంటూ మండిపడుతున్నారు. వసతీగృహం కూలిపోయి 43 రోజులు అవుతున్నా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లింగంపల్లి గురుకుల పాఠశాల, కాలేజీలో దాదాపు 645 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ భవనంలోని ఏడో తరగతి వసతీగృహం సెప్టెంబర్ 9న కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ ఉరుకుల పరుగుల మీద వచ్చి హడావుడి చేశారు. నూతన భవన నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో వసతీగృహం డైనింగ్ హాల్‌ను పూర్తిగా కూల్చేశారు. ఇదంతా జరిగి 43 రోజులు గడిచినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. తాత్కాలిక వసతీగృహం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించినప్పటికీ సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే గదిలో చదువుకోవడం, అదే గదిలో నిద్రపోవాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు.
గురుకుల గురుకుల పాఠశాల కూలిపోయి 43 రోజులు గడుస్తున్న నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై లింగంపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. హాస్టల్ కూలిపోయిన రోజు హడావిడి చేసిన అధికారులు లింగంపల్లి గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణం తాత్కాలిక వసతిగృహం నిర్మాణం చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావడం లేదనే విమర్శిస్తున్నారు. లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు తాత్కాలికమైన వసతి గృహం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 7కోట్లు విడుదల చేసింది అని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు అయినప్పుడు పనులు పూర్తి చేయడం లేదు ఎందుకని అధికారులను నిలదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతోనే లింగంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించి లింగంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని మంత్రి కూడా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూలిపోయిన గురుకుల వసతి గృహాన్ని పూర్తిగా కూల్చివేసి నూతన బిల్డింగ్ నిర్మాణం పనులు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన మంత్రి నేడు మంత్రి జాడనే లేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు మా గురుకుల పాఠశాల గుర్తుందా అని నిలదీస్తున్నారు.