
అందోల్ జూన్ 25: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీడ్ ప్రాసెస్సింగ్ యూనిట్(విత్తనశుద్ధి) కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తనాభివృద్ధ్ది కేంద్రం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు 30 వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని శుద్ధ్దిచేసి వచ్చే సీజన్‌కు మంచి విత్తనాలను అందజేస్తామన్నారు. తద్వారా రైతులకు విత్తనాల కొరత ఉండదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి సంవత్సరం రైతులు ఒకే పంట కాకుండా వేరు, వేరు పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం చందపేట్ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే సర్పంచ్ నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. నాగిరెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఎండీ. కేశవులు, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ అశోక్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.