
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు అద్భుత ఆదరణ లభిస్తున్నది. ఈ పథకం కింద ముందస్తుగా వార్షిక ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రాయితీ ఇస్తుండడమే ఇందుకు కారణం. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో శుక్రవారం నాటికి ఎర్లీ బర్డ్ పథకం ద్వారా రూ.101 కోట్లు వసూలయ్యాయి. ఈ చెల్లింపుల ద్వారా యజమానులకు రూ.5 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఏప్రిల్ నెలాఖరుతోనే ఈ పథకం గడువు ముగియాల్సి ఉన్నది. కానీ, కరోనా నేపథ్యంలో మే నెలాఖరు వరకు పొడిగించారు. ఈ వెసులుబాటును యజమానులు సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో ఎర్లీ బర్డ్ స్కీం కింద 14,05,722 యజమానులు రూ.463.29 కోట్లు చెల్లించేందుకు అర్హలు కాగా.. ఈనెల 14 వరకు 2,29,593 (21.84 శాతం) మంది యజమానులు రూ.101.18 కోట్లు చెల్లించారు. గతేడాది ఈ పథకం ద్వారా రూ.124 కోట్లు వసూలయ్యాయి. ఈ వసూళ్లలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ రూ.12.16 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నిజాంపేట (రూ.6.84 కోట్లు), కరీంనగర్(రూ.4.92 కోట్లు), నిజామాబాద్ (రూ.4.44 కోట్లు) కార్పొరేషన్లు ఉన్నాయి. నకిరేకల్, కొత్తూరు, కొడంగల్, ఖానాపూర్, నర్సాపూర్, ఆలంపూర్ మున్సిపాలిటీలల్లో ఎర్లీ బర్డ్ పథకాన్ని స్థానికులు ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకునేందుకు అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విస్త్రత ప్రచారం నిర్వహించాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
చెల్లింపులు సులభతరం…
ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని సీడీఎంఏ అధికారులు మరింత సులభతరం చేశారు. ఎక్కడి నుంచైనా ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేలా మార్పులు తీసుకొచ్చారు. వాట్సాప్ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు వీలుకల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా 90002 53342 ఫోన్ నంబర్‌ను కేటాయించారు. ఈ నంబర్‌కు ఇంగ్లిష్‌లో హెచ్ఐ అని టైపు చేసి మేసేజ్ చేస్తే ఏ భాషను ఎంపిక చేసుకుంటారో అడుగుతుంది తెలుగు అయితే ఇంగ్లిష్‌లో ఏ అని, ఇంగ్లిష్‌లో అయితే బీ అని టైపు చేసి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్) లేదా ఇంటి నంబర్ ద్వారా సమాచారం తెలుసుకొనేందుకు ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వివరాలతో కూడిన జాబితా వస్తుంది. దాంట్లో నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఇంటి నంబర్ లేదా పీటీఐఎన్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆస్తి పన్నును చెల్లించవచ్చు. ఇదే తరహాలో క్యూఆర్ కోడ్‌తోనూ చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఆస్తి పన్ను డిమాండ్ పత్రంపైనే క్యూఆర్ కోడ్ ముద్రించి ఇస్తున్నారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆస్తి పన్ను వివరాలు ప్రత్యక్షమవుతాయి. అనంతరం క్రెడిట్/డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా గూగుల్ పే , ఫోన్ పే వ్యాలెట్ల ద్వారా పన్ను చెల్లించవచ్చు.