పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, అక్టోబర్ 11 : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మెళకువలు, నూతన వంగడాలపై అవగాహన కల్పించేందుకు త్వరలో రైతులతో కలిసి ఇక్రిశాట్లో పర్యటించనున్నట్టు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్రిశాట్లోని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తులపై పరిశోధనలు నిర్వహించే ఇక్రిశాట్లో రైతులతో కలిసి పర్యటించేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపిందన్నారు. దసరా పండుగ తర్వాత రైతులతో ఇక్రిశాట్ పర్యటన ఉంటుందన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం చెందాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతులు పంటలను ఏ విధంగా పండించాలి.. ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి..? అనే అంశాలపై ఇక్రిశాట్ పరిశోధకులు రైతులకు వివరిస్తారని తెలిపారు. ఇక్రిశాట్ అధికారులు పర్యటనకు అంగీకరించాలని కోరిన వెంటనే వారు సానుకూలంగా స్పందించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఇక్రిశాట్ మానవవనరుల విభాగం అధికారి హరికిషన్ ఉన్నారు.