సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 7 : కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, సబ్ సెంటర్, ఏరియా దవాఖాన, కేంద్ర దవాఖానల్లో కొవిడ్ అవుట్ పేషెంట్స్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ ప్రభుత్వం అందజేసిన మందులను వాడటంతో పాటు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అత్యవసరమైతేనే దవాఖానలో చేరాలి..
4 లేదా 5 రోజులు మందులు వాడినా జ్వరం తగ్గనట్లయితే దగ్గరలోని పీహెచ్సీలో వైద్యుడిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసరమైతేనే దవాఖానలో చేరాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న బృందాలకు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి అన్ని వసతులు ఉన్నాయన్నారు. జిల్లాలోని కేంద్ర దవాఖాన, ఏరియా దవాఖానల్లో కొవిడ్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.