జహీరాబాద్, సెప్టెంబర్ 23: ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించే రెండు రాష్ట్రాలకు చెందిన వాహన చోదకులు, ప్రయాణికులతో పాటు జహీరాబాద్ (Zaheerabad) మండలంలోని అల్గోల్, ఎల్గోయి, పొట్పల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరడం.. భారీగా వరద వస్తే రోడ్డుపై నుంచే ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో మూడేండ్ల క్రితం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్గోల్ చౌరస్తా సమీపంలో రూ.33 లక్షల వ్యయంతో కల్వర్టు, బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
అయితే అల్గోల్ చౌరస్తా సమీపంలోనీ కల్వర్టు మీదుగా వరద నీరు వెళ్తుంది. కొన్నేండ్ల క్రితం ఈ రోడ్డు మార్గంలో ఉన్న వాగుపై నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కల్వర్టు ఇరువైపులా రక్షణ కూడా లేకపోవడంతో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహన చోదకులు జాగ్రత్తగా వెళుతుంటారు. శిథిలావస్థకు చేరిన కల్వర్టు స్థానంలో కొత్తగా నిర్మాలించాల్సి ఉంది. కానీ ప్రజాప్రతినిధుల ప్రయోజనమా?.. అధికారుల తప్పిదామా?.. తెలియదు కానీ అవసరమున్న చోట కాకుండా.. చుక్కనీరు ప్రవహించని చోట కల్వర్టు నిర్మించడం అంతు పట్టడం లేదు.
వాగు ప్రవహించే పరిసర భూముల్లో వెంచర్లు వెలిశాయి. దీంతో వాగు కబ్జాకు గురైంది. వరద నీరు రోడ్లపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగు ప్రవహించే పరిసరాలను ఆక్రమించిన వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కల్వర్టు అవసరం ఉన్నచోట నిర్వహించకుండా మరోచోట పనులు చేపట్టారు. ఆ పనులు కూడా గత మూడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. నిధులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపివేశారు. అటు ప్రజా ప్రతినిధులు, ఇటు సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనచోదకులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. గుంతలు పడిన రోడ్డు మార్గంలో రాకపోకలు సాధించే తెలంగాణ, కర్ణాటక ప్రాంత ప్రజలు, వాహనాల చోధకులు నరకయాతన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్వర్టు ఇప్పటినుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పడుతున్న ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయోనంటూ ఆయా ప్రాంతాల వాహనాచౌదకులు ప్రజలు ఎదురు చూస్తున్నారు.