కంది, అక్టోబర్ 11 : కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కంది మండల గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించి న్యాయ అవగాహన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
లీగల్ సర్వీస్ యాక్టులో భాగంగా 2-3 లక్షల సంవత్సర ఆదాయం కంటే తక్కువ కలిగిన వారికి ఉచితంగా న్యాయ సేవలను అందజేస్తారని తెలిపారు. భార్యభర్తల మధ్య ఉన్న గొడవలను కూడా ఈ లీగల్ సర్వీస్ ద్వారా వెంటనే ఇరు వర్గాలకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరింపజేస్తామని తెలియజేశారు.
రాజీమార్గం ద్వారా ఎన్నో కేసులు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ రాజీమార్గం ద్వారా పరిష్కరించిన కేసులకు సంబంధించిన ఫీజులు కూడా తిరిగి కక్షిదారులకు ఇస్తామన్నారు. ప్రజలకు ఎవైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వెంటనే తమని సంప్రదిస్తే చట్టరీత్యా వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
అలాగే కొంత మంది భూముల అమ్మకాలు, కొనుగోలలో ఎలాంటి బాండ్ పేపర్లు లేకుండా తెల్ల కాగితాలపై సంతకాలు చేసుకుని అమ్మకాలు జరపడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశలత, న్యాయమూర్తి కరుణకుమార్, సర్పంచ్ విమల, ఉపసర్పంచ్ ఖాజా, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, ఎంపీటీసీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.