జహీరాబాద్, జూన్ 14 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఏకంగా స్కూళ్లల్లోనే స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుక్స్ మాత్రమే కాదు.. యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని అంటున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, టై, బెల్టుల అమ్మకాలతో పాఠశాలల దుకాణాలను మరిపిస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు స్టడీ మెటీరియల్, అదీ ఇదీ అంటూ వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిబంధనలను భేఖాతరు చేస్తున్నా సంబంధిత అధికారులు పాఠశాలల వైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది.
అధిక ఫీజులు.. వసతులు కరువు…
నియోజవర్గంలోని ఆయా మండలాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో సామర్థ్యానికి మించి ఇరుకు గదుల్లో 30 నుంచి 50 వరకు విద్యార్థులను కూర్చొబెట్టి పాఠ్యాంశాలు బోధిస్తుండటంతో పాఠ్యాంశాలు అర్థమయ్యేదెలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరో వైపు కొన్ని పాఠశాలలో వేలాది మంది విద్యార్థులుంటే టాయిలెట్లు, బాత్రూమ్లు పదుల సంఖ్యలో ఉండటంతో క్యూలో నిలబడి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
షాపులుగా మారిన పాఠశాలలు..
పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచే ప్రైవేటు పాఠశాలలు షాపులుగా మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. పాఠశాల ప్రారంభం నుంచి విద్యార్థుల స్టడీ మెటీరియల్ కొనాలనే ఉపాధ్యాయుల ఒత్తిడితో తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతన్నారు. ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాఠ్యాంశాలు మొదలుపెట్టాల్సిన ఉపాధ్యా యులు టై, బెల్టులు, యూనిఫాం, షూ, స్టడీ మెటీరియల్ తప్పనిసరని చెప్పటంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థికభారంతో సతమతమవుతున్నారు.
అధిక ఫీజుల నియంత్రణపై అధికారుల పట్టింపేది ?
కూలీ, నాలీ పనులు చేసుకొని పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.