జహీరాబాద్, ఫిబ్రవరి 8 : జహీరాబాద్ ఎన్నికల ఇంచార్జి దేవి ప్రసాద్ ఉంటున్న నివాసంలో శనివారం అర్ధ రాత్రి వరకు పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో అభ్యర్థుల మద్దతుగా మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన గురించి.. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కలిసి తను ఉంటున్న ఇంట్లో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు స్థానిక పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుండి రెండు గంటల వరకు ఆయన నివాసం ఉంటున్న క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంట్లో ఏమీ దొరకక పోవడంతో పోలీసులు వెనుతిరిగి పోయారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అని తెలిసి అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోలీసులను తన నివాసం ఉంటున్న ఇంటిపై పంపించడం సిగ్గుచేటు దేవి ప్రసాద్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో పోలీసులను పంపి తనిఖీల పేరుతో పోలీసులు అర్ధ రాత్రి వరకు హంగామా చేయడాన్ని ఆయనతోపాటు ఎమ్మెల్యే, డీసీఎంహెచ్ చైర్మన్ లు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వస్తున్న హరీశ్ రావు పర్యటన గందరగోళం సృష్టించాలని ఉద్దేశంతో అధికార పార్టీ ఒత్తిడితో పోలీసుల తనిఖీలతో ఇబ్బందులకు గురి చేసిన ఉరిగేది ఏమీ లేదన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడం, బీఆర్ఎస్ పార్టీ పై వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో జహీరాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమన్నారు.