కంది, మే 15 : కంది మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా తయారై ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మండలంలోని ఇంద్రకరణ్, చేర్యాల్, చిమ్నాపూర్, చెర్లగూడెం రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు, స్థానిక ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. మండలంలోనే అతి పెద్ద గ్రామ పంచాయతీగా అధిక జనాభా కలిగిన ఇంద్రకరణ్ రహదారి భయానకంగా తయారైంది.
ఈ ప్రాంతంలో పలు పరిశ్రమలు ఉండటంతో నిత్యం వందల సంఖ్యలో లారీలు, ఇతర వాహనాలు తిరుగుతుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని స్థానికులు భయాంధోళనకు గురువుతున్నారు. అదే విధంగా చేర్యాల్ గ్రామం నుంచి బెంగళూర్ హైవేకు కలిసే బీటీ రోడ్డు మొత్తం ఛిద్రంగా మారింది. ఈ దారి గుండా వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. కాశీపూర్ నుంచి కలివేముల, చెర్లగూడెం వరకు ప్రయాణించాలంటే నరకం చూడాల్సిందే మరి. ఇక చిమ్నాపూర్ నుంచి కంది వరకు వెళ్లే రోడ్డు మద్య మద్యలో పూర్తిగా దెబ్బతిని గుంతలు దర్శనమిస్తుంది.
దగ్గరి వరకు వెళ్తేనే గుంతలు కనిపిస్తుండటంతో వాహనదారులు స్పీడ్‌గా వెళ్లి కంట్రోల్ చేయలేకపోతున్నారు. సంబంధిత అధికారులు ఈ దారుల గుండా కనీస మరమ్మతులు సైతం చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామీణ రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.