పటాన్చెరు, డిసెంబర్ 28: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని సర్వే నం బర్ 329లో అనకొండలు ఖాళీ జాగాలను మింగుతున్నారు. త్వరలో చిట్కుల్ మున్సిపాలిటీలో విలీనం అవుతుందనే ప్రకటనతో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ సర్వేనంబర్‌లో ఖాళీ జాగాలను కబ్జాచేసి నిర్మాణాలు చేస్తున్నారు. క్రిస్మస్తో పాటు వచ్చిన వరుస సెలవులను గుర్తించిన కబ్జారాయుళ్లు పావులు కదిపి ఖాళీ జాగాలో ఇండ్లను చకచకా నిర్మిస్తున్నారు. మూడు రోజుల్లోనే కొందరి పునాదులు, గొడలు పూర్తి అయ్యాయి. ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. వంద నుంచి రెండు వందల గజాల మేరకు నాయకులు, వారి అనుచరులు కబ్జాలు చేసి ప్లాట్లలో ఇండ్లను నిర్మిస్తున్నారు. 2008లో 518 మందికి సర్వేనంబర్ 329లో ప్రభుత్వం ప్లాట్లు పంపిణీ చేసింది.
వారిలో సగానికి పైగా నాయకులే ప్లాట్లు పంచుకున్నారన్న విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ప్లాట్లను పొందిన వారి లిస్టులను అధికారులు సర్వేచేసి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. వారి లో ప్లాట్లు పొందిన నిరుపేదలను స్థానికంగా నష్టపోయిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇండ్లు నిర్మించుకోకుండా అడ్డుపడుతున్నారు. మాకు దక్కనిది మీకు దక్కవద్దనే తీరున 329 సర్వేనంబర్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదు. 16 ఏండ్ల తర్వాత తిరిగి ఖాళీ జాగాల్లో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో ప్లాట్లు పొందినవారిని బెదిరించి కొందరు నాయకులు వారి పాత పట్టాలను అగ్గువకు కొంటున్నారు. మరికొందరు ప్లాట్లుగా చేయని ఖాళీ జాగాలను కబ్జా చేసి ప్లాట్లుగా చేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. మూడు రోజుల్లో దాదాపు 40కి పైగా నిర్మాణాలు జరిగాయి. మరోపక్క తమ ప్లాట్లను కబ్జా చేస్తున్నారని గతంలో పట్టాలు పొందిన గ్రామస్తులు కొత్తగా నిర్మాణాలు చేస్తు న్న వారితో గొడవకు దిగుతున్నారు. చిట్కుల్లో ఒకే ప్లాట్ స్థలం కోసం ఇద్దరు తెరమీదకు రావడంతో ఘర్ష ణ వాతావరణం నెలకొన్నది. నాయకులు వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
చకచకా నిర్మాణాలు…
చిట్కుల్ మెయిన్ రోడ్‌పై సర్వేనంబర్ 329లో విలువైన స్థలం ఉంది. గతంలో ఈ సర్వేనంబర్‌లో కొందరికి ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. 1994లో ప్లా ట్లు పంపిణీ చేసింది. 2000లోనూ ప్లాట్లు చేసి పేదలకు పంపిణీ చేసింది. ఆ ప్లాట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేశారు. తిరిగి 2008లో అప్పటి ప్రభుత్వం 518మంది పేదలకు పట్టాలు పం పిణీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మం త్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఏప్రిల్ 8, 2008న ప్లాట్లు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ప్లాట్లలో బినామీలు ఉన్నారనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి. ఆ తర్వాత గ్రామ నాయకులు ఇం ట్లో ఉన్న కుటుంబ సభ్యులదరికీ ప్లాట్లు రాసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. అప్పుడు కూడా సెలవురోజుల్లో గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు చకచకా ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. వందగజాల ప్లాట్ స్థానంలో నాలుగు వందల గజాల ప్లాట్ల లో నిర్మాణాలు చేపడుతుండడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు లు అందాయి. అప్పటి కలెక్టర్ పేదల ప్లాట్లలో నాయకులు కడుతున్న ఇండ్లను జేసీబీలతో కూల్చివేయించారు. 518 ప్లాట్లపై అధికారులతో విచారణ చేయించారు.
విచారణలో గ్రామస్తులు, వడ్డెరకాలనీ వాసులైన పేదలు మాత్రమే అర్హులుగా తేల్చారు. పట్టాలు ఉన్న నిరుపేదలు ఇండ్లను నిర్మించేందుకు ప్రయత్నిస్తే, నాటి నాయకులు కోపంతో అడ్డుకుని పనులు జరగనివ్వలేదు. దీంతో గ్రామానికి చెందిన అర్హులు పట్టాలున్నా నాయకుల కారణంగా ఇండ్లు కట్టుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారం రోజులుగా నాయకులు పావు లు కదిపి పాత పట్టాలు ఉన్నవారి వద్దనుంచి వాటిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు నాయకులు 329లోని మిగిలిన ఖాళీ జాగాలను కబ్జా చేస్తున్నారు. నాయకుల కుటుంబ సభ్యులు, అనుచరులు ఖాళీ జాగాలను కబ్జా చేసి శరవేగంగా ఇండ్లను నిర్మిస్తున్నారు. త్వరలో చిట్కుల్ గ్రామం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం అవుతుందనే ఆలోచనతో నాయకులు కబ్జాల పర్వానికి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడే ఇంటినంబర్ పొందాలనే ఆశతో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసిం ది. గ్రామ కార్యదర్శి కవిత, పటాన్చెరు ఆర్ఐ ఖాజా నిర్మాణాలు జరుగుతున్న 329 సర్వే నెంబర్ వద్దకు రాగా, ఇండ్ల నిర్మాణం చేస్తున్న వ్యక్తులు వచ్చి తమ వద్ద పట్టాలు ఉన్నాయని, నిర్మాణ పనులు ఆపమని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.