మునిపల్లి, నవంబర్ 25: సంగారెడ్డి జిల్లా మునిపల్లిలోని (Munipally) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Sub Registrar) పేరుకేనా అని అడిగితే కాదని చెబితే పొరపాటే అవుతుంది. మునిపల్లి తాసిల్దార్ (Tehsildar) తన ఇష్టా రాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని వ్యవసాయ భూములన్నీ తాసిల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ జరగాలి. ముంబై జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న భూములను హైదరాబాద్‌లోని బడా వ్యాపారులు కొనుగోలు చేసి వెంచర్లు చేసేందుకు ఏర్పట్లు చేసుకుంటున్నారు. ఇలా రియల్టర్లు కొనుగోలు చేసిన వందల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్ కార్యాలయంలోనే జరగాలి. కానీ, మునిపల్లి తహసీల్దార్ అత్యుత్సాహంతో కంప్యూటర్ ఆపరేటర్లను హైదరాబాద్‌లోని బడా వ్యాపారుల ఇంటి వద్దకి పంపించి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో ఉన్న ఓ సర్వేనంబర్‌లో కొన్ని ఎకరాల భూమిపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ నాలా రిజిస్ట్రేషన్ చేయడం, ఖమ్మంపల్లిలో ఓ కంపెనీకి సంబంధించిన (118)ఎకరాల భూమిపై న్యాయస్థానంలో కేసు ఉన్నప్పటికీ తహసీల్దార్ నాలా రిజిస్ట్రేషన్ జరిపించిన వ్వవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని పెద్దగోపులారం, బుదేరా, కంకోల్, లింగంపల్లి, మేళసంఘం, మగుద్దుమ్పల్లి గ్రామాలు ముంబై జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన బడా వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. దీనికోసం ముందుగా ప్రభుత్వానికి రుసుము చేల్లించి వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చాలి. రెవెన్యూ చట్టం ప్రకారం నాన్ అగ్రికల్చర్‌గా మార్చే భూములను ముందుగా ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి, అక్కడ చెరువులు, కుంటలు, విద్యుత్ స్తంభాలు, ఏమైనా కట్టడాలు ఉన్నాయా లేదో సంబంధిత ఆర్ఐ పంచనమా చేయాలి. ఆ తర్వాతే నాలా రిజిస్టేషన్ పక్రియ మొదలు పెట్టాలి. అయితే మునిపల్లి తాసిల్దారుకు ఎలాంటి సర్వే, ఆర్ఐ రిపోర్టులు అవసరం లేదు. పంచనామాలతో పనిలేకుండా ఇష్టానుసారంగా వందల ఎకరాల భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నకారు రైతులు భూములు అమ్ముకునేటప్పుడు వచ్చే రూల్స్.. బడా వ్యాపారాలు ఇచ్చే ముడుపుల ముందు పనికిరావా అని విమర్శిస్తున్నారు.
మునిపల్లి తాసిల్దార్ చేస్తున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. మండలంలోని ఆయా గ్రామాల్లో వాక్ భూములు, డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు నమస్తే తెలంగాణలో కథనం వచ్చినప్పటికీ తహసీల్దారుపై జిల్లా అధికారులు స్పందించక పోవడం పై అనుమమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.