Govt Hospital | మునిపల్లి, అక్టోబర్ 27 : గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అంటే సర్కార్ దవాఖానాకు పరిగెత్తుకుంటూ పోయేవారు.. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాకు పోవాలంటే స్థానిక ప్రజలు జంకుతున్నారు…నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు అనే విధంగా తయారైంది మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం..
మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సరైన వసతులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే మండల ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోతున్నారు తప్ప…మెరుగైన వైద్యం అందుతుందని మాత్రం కాదు అంటున్నారు మండల వాసులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందక.. ప్రైవేట్ వైపు పరుగెడుతున్నారు..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇలాఖాలో వైద్యం అందించడంలో వైద్యులు మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు మండల వాసులు ఆరోపిస్తున్నారు.
అటు తర్వాత నర్సులే డాక్టర్స్..
మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాయంత్రం నాలుగు దాటితే చాలు డాక్టర్స్ కనిపించరు.. సాయంత్రం నుంచి తెల్లారి డాక్టర్స్ వచ్చేదాకా ఎలాంటి వైద్యం కోసం ప్రజలు వచ్చిన అందుబాటులో ఉన్న నర్సులే వైద్యం చేస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రైవేట్ ఆసుపత్రికి పోవాల్సిందేనని మండల వాసులు చెబుతున్నారు.
డాక్టర్స్ అందుబాటులో ఉండరు : కాంగ్రెస్ నేత దాస్
మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉండరు. కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో సర్కార్ దవాఖానాలో మెరుగైన వైద్యం అందుతుండే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగైన వైద్యం అందడం లేదు. ఈ నెల 22న నా కుమారుడు చైతన్యకు ఆరోగ్యం బాగాలేక మునిపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాను. డాక్టర్స్ నా కుమారుడికి వైద్య పరీక్షలు చేసేందుకు బ్లడ్ శాంపుల్స్ తీసుకొని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పంపించారు.
మరుసటి రోజు వైద్య పరీక్షల రిపోర్టులో అంత నార్మల్ అని రావడంతో సంతోషంగా ఇంటికి తీసుకుపోయాం. అదే రోజు రాత్రి విపరీతమైన జ్వరం రావడంతో భయంతో సదాశివపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయిస్తే టైఫాయిడ్ రావడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వేల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం అందించాను. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుంటే ప్రాణాలు పోతాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు డాక్టర్స్ అందుబాటులో ఉండరు. మండల వాసులు ఆలోచించి ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.