Municipal Elections | జహీరాబాద్ , జనవరి 24 : మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. రిజర్వేషషన్లలో అవకాశం కోల్పోయిన నాయకులు చాలామంది సైలెంట్ అవ్వగా, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే గల్లీల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మద్దతు కోరుతున్నారు.
జహీరాబాద్ పట్టణంలో 37 వార్డులు ఉండగా అన్నిచోట్ల రాజకీయ సందడి నెలకొంది. రిజర్వ్ స్థానాలలోనే తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ తమకే వస్తుందనుకున్న నాయకులు ధీమాతో ప్రచారం మొదలుపెట్టగా, పోటీ ఉన్న చోట మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకుల అనుగ్రహం కోసం ఆశావహులు తిరుగుతున్నారు. టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆరేళ్ల తర్వాత మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టికెట్ల కోసం ఆశించే నాయకులు, ఆశావాహులతో ఆయా పార్టీ కార్యాలయాల వద్ద సందడి మొదలైంది. టికెట్ కోసం ముఖ్య నాయకులకు దగ్గరగా ఉన్న వారితో లాబీయింగ్ చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నవారితో మాట్లాడించి టికెట్ వచ్చేలా చేయాలని కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఆశావాహులు ఇప్పటికే వార్డుల్లో ప్రచారం షురూ చేశారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
మున్సిపాలిటీ పీఠం బీసీకి రిజర్వ్ కావడంతో ఆయన పార్టీలకు చెందిన బీసీ వర్గాలకు చెందిన నాయకుల మధ్య టికెట్ కోసం గట్టి పోటీనే ఉంది. మిగిలిన వార్డుల్లో కూడా కూడా ఆయా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల ఆశీస్సుల కోసం ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాయకులు కూడా తెరపైకి వచ్చి టికెట్ కోసం పైరవీలు సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తులు చేసుకున్న వారిలో అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారుతోంది.
పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా వార్డుల వారీగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఆయా వార్డుల్లో ఉన్న సామాజిక వర్గాల బలం, పోటీలో ఉండే అభ్యర్థి సామాజిక వర్గంతోపాటు ఆ వర్గంలో అతనికి ఉన్న ఆదరణను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతోపాటు ఎంఐఎం, సీపీఐ పార్టీల్లో ఇప్పటికే వార్డులకు అభ్యర్థులను ముఖ్య నాయకులు కొంతమందిని ఎంపిక చేసుకోగా, మిగతా వార్డుల్లో మాత్రం ఒక్కో వార్డు నుంచి రెండు, పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో ఎవరైతే గెలుస్తారని ద్వితీయ శ్రేణి నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీల నాయకులు కొన్నిచోట్ల డమ్మీలను కూడా బరిలో దించే అవకాశం లేకపోలేదు. అవతలి పార్టీలో తమకు కావలసిన నాయకుడి కోసం తమ పార్టీ నుంచి డమ్మీలను కూడా దించుతున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆయా పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా పార్టీలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరులో ఆయా పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగనుంది.