అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్, ఫిబ్రవరి 9: ఉద్యమకారులను, యావత్తు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మా ట్లాడిన ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, వెంటనే తెలంగాణ ప్రజలకు మోదీ క్షేమాపణ చెప్పాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. పీఎం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తాయి. మోదీ శవయాత్రల ఊరేగింపు, దిష్టిబొమ్మలను దహనం చేసి, నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. జోగిపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పార్టీ నేతలతో కలిసి హనుమాన్ మందీర్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటన్నారు. రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడ అభివృద్ధి కోసం కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణపై విషం కక్కుతున్న మోదీ ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మాజీ చైర్మన్లు, నాగభూషణం, నారాయణ, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, రైతుబంధు జిల్లా సభ్యులు లింగాగౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాకారం
జహీరాబాద్, ఫిబ్రవరి 9: ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏండ్లు ఉద్యమం చేస్తే తెలంగాణ ఏర్పడిందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ స్టాండ్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.