రామచంద్రాపురం, సెప్టెంబర్ 8: తెల్లాపూర్ మున్సిపాలిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నది. అర్ధరాత్రి కాలనీల్లో తిరుగుతూ తాళాలు ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్నది. బుధవారం ఐదు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడడంతో విద్యుత్‌నగర్, తెల్లాపూర్ ప్రజలు భయబ్రాంతులకు గురువుతున్నారు. గురువారం తెల్లాపూర్‌లోని ఇన్ఫినిటీ హోమ్స్‌లో దొంగలు సంచరిస్తున్న ఘటనలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాలనీల్లో తిరుగుతూ ఎవరూ లేని ఇండ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అమీన్‌పూర్‌లోని ఓ కాలనీలో కూడా చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న ఘటన సీసీ కెమెరాలో నమోదైంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ లో ఎన్నో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్‌లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ దొంగలు వారి కండ్లు కప్పి లోనికి ప్రవేశిస్తున్నారు. పెర్చి మెగా మెడోస్ విల్లాస్‌లో దొంగలు గ్రిల్‌ని తొలగించి ఇంట్లోకి ప్రవేశించి రూ.8 లక్షలు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాం..
చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు మాకు సమాచారం రావడంతో ప్రత్యేక గస్తీ ఏర్పాటుచేశాం. తెల్లాపూర్ మున్సిపాలిటీ, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల్లో పెట్రోలింగ్ వాహనాలు, క్రైం టీమ్‌లు, బ్లూకోట్స్ తిరుగుతున్నాయి. కాలనీల అసోసియేషన్ సభ్యులు నిత్యం సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తుండాలి. ఎవరైనా అనుమానంగా కన్పిస్తే పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలి. ఇంటి నుంచి బయటకెళ్లినప్పుడు విలువైన వస్తువులు, నగదు లేకుండా జాగ్రత్త పడాలి. 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారు. దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – సంజయ్‌కుమార్, సీఐ