సంగారెడ్డి, ఏప్రిల్ 6: “మోదీ హటావో.. దేశ్‌కు బచావో”, రాష్ట్రంలో అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా మొండివైఖరి అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిప్పులు చేరిగారు. బుధవారం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 65వ జాతీయ రహదారి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బైటాయించి నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ హాజరయ్యారు.
రహదారి దిగ్బంధంతో పటాన్చెరు వైపు రుద్రారం వరకు జహీరాబాద్ వైపు సదాశివపేట సమీపం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటపాటు కొనసాగిన ఈ నిరసన కార్యక్రమానికి వాహనదారులు, ప్రజలు సమన్వయం పాటించి మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, జడ్పీటీసీలు కొండల్‌రెడ్డి, సునీతా మనోహర్‌గౌడ్, పద్మావతీపాండురంగం, ఎంపీపీలు సరళ, యాదమ్మ, మనోజ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు విజయభాస్కర్‌రెడ్డి, నందకిషోర్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, చక్రపాణి, మాకం విఠల్, మధుసూదన్‌రెడ్డి, ఆంజనేయులు, నర్సింలు, శ్రీనివాస్ ముదిరాజ్, సాయగౌడ్, చీల మల్లన్న, వీరేశం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, బొంగుల రవి, బీరయ్య యాదవ్, హరికిషన్, చింతా గోపాల్, చిల్వరి ప్రభాకర్, చిన్నా, సుధీర్‌రెడ్డి, కాసాల రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, గుండప్ప, జాగృతి భిక్షపతి, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నేడు రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా
హాజరుకానున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రైతులకు మద్దతుగా చేపడుతున్న ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కోరారు.
బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీ..
బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీ. ప్రజలు సంతోషంగా లేకుండా చేస్తున్నది. మొండివైఖరి అవలంభిస్తున్నది. తెలంగాణ రైతులు పండించినది ధాన్యం కాదా..? పంజాబ్‌లో పండిన ధాన్యమే కనిపిస్తుందా? దేశంలో బీజేపీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తూ రైతులను అగమ్యగోచరానికి గురి చేస్తుంది. 70 ఏండ్ల దేశ పాలనలో ఏ రాజకీయ పార్టీ ఇంతటి దుర్మార్గమైన పాలన చేయలేదు. నూకలు తెలంగాణ ప్రజలు బుక్కడంతోనే రాష్ట్రం సాధించారు. మీకు కూడా నూకలు బుక్కించి ధాన్యం కొనుగోలు చేయిసాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు, ప్రజలు, నాయకులు నిరసనలు చేస్తున్నారు.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
ధాన్యం కేంద్రమే కొనాలి..
– క్రాంతి కిరణ్, అందోల్ ఎమ్మెల్యే
తెలంగాణలో రైతులు పండించిన వడ్లను పూర్తిగా కేంద్రమే ఎఫ్‌సీఐతో కొనుగోలు చేయించాలి. కేంద్రం రాష్ర్టాలతో సన్నిహింతగా ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి ప్రజలకు చేరుతుంది. ధాన్యం కొనుగోలులో వివక్ష చూపితే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఒకే విధమైన పాలన అందించాలి. మోదీ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి.
వివక్ష మానుకోవాలి..
– మాణిక్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే
నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా ఆదుకుని అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వివక్ష చూపుతూ రాజకీయం చేయడం మానుకోవాలి. ఉద్యమాలతో రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మరో ఉద్యమానికి తెరలేపక ముందే కేంద్ర దిగివచ్చి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు చివరి గింజ వరకు కేంద్రంతో వడ్లను కొనిపిస్తామని రైతులను మోసం చేస్తున్నారు. ఆ నాయకుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజా క్షేత్రంలో బీజేపీకి భంగపాటు తప్పదు.
నిర్లక్ష్యానికి నిదర్శనం..
– చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దున్నపోతు మీద పడ్డ వానలా కేంద్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం. ప్రధాని మోదీ మెడలు వంచి యాసంగి ధాన్యాన్ని కొనిపిస్తాం. రాజకీయాలకు అతీతంగా అన్నదాతలు పండించిన వడ్లను కొనకపోవడం రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతుల ఆగ్రహం చవి చూడక ముందే కేంద్రం దిగి రావాలి.
కేంద్రం ధాన్యాన్ని వెంటనే కొనాలి…
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు
పంజాబ్‌లో పండిన పంటనే కేంద్రం కొంటుందా.? తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎందుకు? రాష్ట్రంలోని బీజేపీ నాయకులు గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ తెలంగాణ అన్నదాతల్లో ఆందోళన కలిగించడం ఎంతవరకు సమంజసం. వడ్ల కొనుగోలులో వివక్ష చూపితే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు.