గజ్వేల్, ఏప్రిల్ 6: మండుటెండల్లో గోదావరి జలాలు రైతు పండిస్తున్న పంటలకు ప్రాణం పోయడానికి పరుగులు పెడుతున్నాయి. రైతుల పంటలను కాపాడడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి చెరువులు కుంటలు నింపుతున్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా మునిగడప వరకు నిరంతరరాయంగా గోదావరి జలాలను అందిస్తుండగా, మంగళవారం రాత్రి అధికారులు గజ్వేల్, రామాయంపేట కెనాల్స్ ద్వారా మర్కూక్, గజ్వేల్, వర్గల్, రాయపోల్, దుబ్బాక మండలాల్లోని చెరువులు, కుంటలను నింపడానికి గోదావరి నీటిని విడుదల చేశారు. గజ్వేల్ కెనాల్ ద్వారా 20 చెరువులు, కుంటలు నిండనుండగా, 1500 ఎకరాలకు సాగునీరు అందనుంది. రామాయంపేట కెనాల్ దౌల్తాబాద్ మండలం వరకు పనులు పూర్తి కావడంతో గజ్వేల్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లోని 55 చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండనున్నాయి. 3631 ఎకరాలకు సాగునీరు అందనుంది.
రామాయంపేట కెనాల్ ద్వారా..
రామాయంపేట కెనాల్ ద్వారా నింపాల్సిన చౌదరిపల్లి బంధం చెరువు, గుంటి పల్లి పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువుల్లోకి హల్దీ వాగును నింపే క్రమంలో సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలను నింపగా, ఇప్పటికే అలుగుపారుతున్నాయి. రామాయంపేట కెనా ల్ నుంచి సింగాయపల్లి ఊరచెరువు, జబ్బాపూర్ మంచుకుంట, నెంటూరు గొట్ల చెరువు, జబ్బాపూర్ తుర్కవానికుంట, బండకుంట, మక్తమాసాన్‌పల్లి లక్ష్మీచెరువు, నెంటూరు సామలచెరువు, కుంటచెరువు నెంటూరు, మజీద్‌పల్లి మేలకుంట, బంగ్లావెంకటాపూర్ చింతలకుంట, చిన్నబురుగు కుంట, పెద్దచెరువు, ఎల్కంటి కోలసముద్రం, మజీద్‌పల్లి బోయినమ్మ చెరు వు, రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి చింతల చెరువు, రాంసాగర్ ఎల్ల మ్మ చెరువు, లింగారెడ్డిపల్లి విశ్వనాథ చెరువు, కొత్తపల్లి రెడ్డి చెరువు, చిన్నమాసాన్‌పల్లి సింగం చెరువు, దిలాల్పూర్ ఊరచెరువు, రాంసాగర్ వెంకటాద్రి చెరువు, కొత్తపల్లి అల్లి చెరువు, కొత్తపల్లి ఊరచెరువులు, రామారం నల్లొని కుంట, రాందాస్ చెరువు, మహాదేవుని చెరువు, కొత్త చెరువు, దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ దుంబర్ల కుంట, ఇందుప్రియాల్ కొమ్మయోల్ల కుంట, ఊరచెరువులతో పాటు దౌల్తాబాద్ మండలంలోని మరో 22చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండనున్నాయి.
గజ్వేల్ కెనాల్ ద్వారా..
మంగళవారం రాత్రి 10గంటల వరకు శ్రమించి ఇరిగేషన్ అధికారులు గజ్వేల్, రామాయంపేట కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేశారు. కాగా, గజ్వేల్ కెనాల్ ద్వారా ఇప్పటికే మర్కూక్ మండలం పాతూరు రెడ్డికుంట, ప్రజ్ఞాపూర్‌లో రంబవాని కుంట, బర్రోని చెరువులు నిండి శ్రీగిరిపల్లి చింతల చెరువులోకి గోదావరి జలాలు వెళ్తున్నాయి. ప్రజ్ఞాపూర్ ఊరచెరువు, ముట్రాజ్‌పల్లి మొండికుంట, పిన్నకుంట, బర్రిచెరువు, గజ్వేల్ ఎర్రకుంట, సంగుపల్లి పాతకుంట, ధర్మారెడ్డిపల్లి దర్మికుంట, పల్లెచెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, నల్లవాగు చెక్‌డ్యామ్ నుంచి దాచారంలోని పెద్ద చెరువు, అమ్మకుంట, జాలిగామ, బయ్యారం చెరువులు గోదావరి జలాలతో నిండనున్నాయి. మరో మూడు,నాలుగు రోజుల్లో ఈ చెరువులన్నీ నిండనున్నాయి.