హత్నూర,జూన్29 : లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన అతిథిగృహం భవనం ప్రారంభించి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అలంకార ప్రాయంగా దర్శనమిస్తుంది. భవనం నిర్మించి ఏండ్లు గడుస్తున్నా ఉపయోగంలో లేకపోవడంతో భవనం తలుపులు, కిటికీలు చెడిపోవడంతోపాటు గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రమైన హత్నూర గ్రామశివారులో నీటిపారుదలశాఖ, ఆయకట్టు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రూ.27లక్షల 60వేలతో అతిథిగృహం భవనం నిర్మించారు.
భవనం ప్రారంభించి భవనంలో పర్నిచర్ ఏర్పాటుచేయకపోవడంతో భవనానికి కొన్నిరోజుల్లోనే అధికారులు తాళం వేశారు. దీంతో భవనం గోడలకు పగుళ్లు ఏర్పడటంతోపాటు తలుపులు, కిటికీలు పూర్తిగా చెడిపోయాయి. కాగా నిరుపయోగంగా మారిన భవనం పరిసర ప్రాంతం సాయంత్రం సమయంలో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్న అతిథిగృహం భవనం ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.