సంగారెడ్డి : రైతుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల (Lagacharla) ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ (Ethanol ) ఫ్యాక్టరీలపై వెనక్కి తగ్గిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ అదానికి(Adani) వ్యతిరేకంగా ఉన్నందునే సీఎం రేవంత్ రెడ్డి అదాని ఆఫర్ను తిరస్కరించాడని పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ (Parliament) సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై మోదీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని అన్నారు. అదాని ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని ఆరోపించారు.
ముడుపుల కుంభకోణం నుంచి అదానిని రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదాని వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత 55 లక్షల ఓట్లు పోల్ కావడం అనుమానానికి దారితీస్తుందని అన్నారు. వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.