Alumni Reunion | కోహీర్, జూన్10: ప్రతీ ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. అన్ని వేళల్లో దేశ హితం కోసం పాటుపడాలని సూచించారు. దిగ్వాల్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ ఆట పాటలతో హోరెత్తించారు. ఒకరినొకరూ తమ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, సతీశ్, రాఘవేంద్రరావు, శ్రీకాంత్‌రెడ్డి, బాబురావు, సంగయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.