Khalilpur Village | జహీరాబాద్, అక్టోబర్ 28 : తాగునీటి కోసం ఆ గ్రామస్తులకు తిప్పలు తప్పడం లేదు. నిధులు లేక పంపుసెట్లు మరమ్మత్తులు నోచుకోని దుస్థితి నెలకొంది. తాగునీటి ఇబ్బందులు తీర్చాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం.. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా చందాలు వేసుకుని కాలిన బోరు మోటారుకు మరమ్మతులు చేయించుకున్నారు.
గ్రామం పక్కనే గలగల పారుతున్న నారింజ వాగు ప్రాజెక్ట్.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రక్షిత మంచినీటి బోర్లలో పుష్కలంగా నీరుంది. కానీ తాగునీటి సరఫరా చేసే బోరు మోటార్లు కాలిపోయాయి. గ్రామ పంచాయతీలకు నిధుల కొరతతో సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు కనీసం కాలిపోయిన బోరు మోటార్లకు మరమ్మతులు చేద్దామన్నా నిధులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకే సొంత డబ్బులతో గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చినా.. బిల్లులు రాక నానా అవస్థలకు గురవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఖలీల్ పూర్ గ్రామంలో తాగునీటి సరఫరా చేసే పంపుసెట్లు కాలిపోవడంతో మరమ్మతులు నోచుకోలేక తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని ఒకటి, మూడు, ఐదు వార్డుల్లో సింగిల్ ఫేస్ పంప్ సెట్ మోటార్లు కాలిపోవడం వల్ల ఆయా కాలనీవాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. పంప్ సెట్ మోటార్లకు మరమ్మతులు చేసి తాగునీటి ఇబ్బందులు తీర్చాలని ఆయా కాలనీవాసులు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
నారింజ వాగు గలగల పారుతున్నప్పటికీ..
గ్రామం పక్కనే నారింజ వాగు గలగల పారుతున్నప్పటికీ, రక్షిత మంచినీటి బోరు బావుల్లో పుష్కలంగా నీరున్న తాగడానికి బిందెడు నీళ్లు లభించక నిత్యం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా ఎస్సీ వాడలో సింగిల్ ఫేస్ మోటారు కాలిపోవడంతో ఎవరో వస్తారని.. ఎవరో మంచి చేస్తారని ఎదురు చూడకుండా కాలనీవాసులు ఇంటింటికి తలా కొంచెం చందాల రూపంలో డబ్బులు పోగు చేసుకున్నారు.
మెకానిక్‌ను కాలనీకి రప్పించి కాలిపోయిన పంపు చెట్టును బయటకు తీసి మరమ్మత్తులు చేయించేందుకు తీసుకెళ్లారు. ఇదివరకే ఓసారి చందాలు వేసుకుని పంప్ సెట్టుకు మరమ్మతులు చేయించుకుపన్నామని కాలనీకి చెందిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు పూర్ణచందర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినప్పటికీ గ్రామాల్లో నెలకొన్న అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అటు ప్రభుత్వం గానీ ఇటు అధికారులు గానీ పట్టించుకోకపోవడంతోనే కాలనీలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను తీర్చుకునేందుకు పంపుసెట్టుకు మరమ్మతుల కోసం చందాలు వేసుకుని బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Shaligouraram | తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయడంలే.. శాలిగౌరారంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
Cyclone Montha | దూసుకొస్తున్న ‘మొంథా’.. అల్లకల్లోలంగా ఒడిశా తీరం.. Video