ఝరాసంగం, మార్చి 7 : మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తమకు వద్దని, వెంటనే తొలగించాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ అయిన రాజును నియమించాలని సుమారు 30 మంది ఉపాధి కూలీలు మండల అభివృద్ధి అధికారి సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.
అంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుకు వ్యతిరేకంగా ఎంపీపీ కార్యాలయం ముందు ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేశారు. కప్పాడ్ గ్రామానికి చెందిన వ్యక్తిని తమ గ్రామానికి ఫిల్డ్ అసిస్టెంట్‌గా నియమించడంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని అన్నారు. పని విషయంలో ఏదైనా అడిగితే సరైన సమాధానం ఇవ్వకపోగా ఇష్టం ఉంటే చేయండి.. లేదంటే పని మానుకోండి.. లేదంటే ఇష్టమున్న చోట చెప్పుకొండి అంటూ తమకు దబాయిస్తున్నాడని ఉపాధి కూలీలు వాపోయారు.
ఉపాధి హామీ పథకంలో తమకు సరిగా కూలీ పని కల్పించడం లేదని, పని చేసిన తరువాత కొలతలు కూడా తమే చేసుకుంటున్నమని ఫీల్డ్ అసిస్టెంట్ సరిగ్గా ఫోటోలు తీయకపోవడంతో మేము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఎంపీడీవో ఫోన్ చేసి ఆయన పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పని కల్పించకపోతే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. విధులకు సక్రమంగా హాజరు కానిఉపాధి హామీ ఈసీ ప్రతాప్ రెడ్డి పై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.