ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇల్లు నిర్మించి.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలనే ఆశయం నీరుగారిపోతోంది. అందుకు నిధుల కొరతా? లేదంటే అధికారుల నిర్లక్ష్యమా? అనేది తెలియడం లేదు. మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లు అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
స్లాబు, గోడల వరకూ పూర్తయినప్పటికీ తలుపులు అమర్చకపోవడంతో ఆ ఇల్లు పశువులకు, వీధి శునకాలకు ఆశ్రయంగా మారింది. వివిధ పనుల నిమిత్తం తహసిల్దార్ (MRO) కార్యాలయానికి వచ్చే వాళ్లు ఈ ఇంటి ఆవరణను మూత్రశాలగా ఉపయోగించుకోవడంతో పరిసరాలంతా దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంతేకాదు చుట్టుపక్కల చెట్ల పొదలు, ముళ్లు పెరిగాయి. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. మోడల్ ఇల్లును ఇలా నిర్లక్ష్యం చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా స్పందించాలని.. ఆ ఇల్లును పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.