Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్సిన వారికే కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాక అయిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంతో పాటు, మొగ్దంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగా మారిపోతుందని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఓ బాధితుడు స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.
మునిపల్లి మండల కేంద్రంలో 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. ఇందులో మునిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే సరదు లబ్ధిదారుడికి మునిపల్లిలో ఎనిమిదెకరాల వ్యవసాయ భూమితో పాటు, సంగారెడ్డి పట్టణంలో సొంత ఇల్లు కూడా ఉంది. అయినప్పటికీ అతన్ని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం పట్ల అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రమేశ్ అనే బాధితుడు అధికారులను అడగ్గా.. పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడి దగ్గరికి వెళ్లి కలవగా.. నువ్వు ఇతర పార్టీకి చెందిన వాడివి.. నీకు ఇవ్వం.. నాకు ఇష్టం వచ్చినోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని పంపించేశాడని బాధితుడు ఆవేదన చెందాడు. అర్హులకు కాకుండా వేరే వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారని ఆగస్టు 8వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని.. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నాడు.
మొగ్దంపల్లి గ్రామానికి 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అందులో రెండింటిని మునిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుటుంబ సభ్యులకే కేటాయించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారినే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం పట్ల అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిశీలిస్తేనే.. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటే ఏం తెలుస్తుందని విమర్శలు కురిపిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం సంబంధిత అధికారుల వద్ద ఎంత మొరపెట్టుకున్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఏసప్ప అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్యతో పాటు ఐదుగురు పిల్లలతో గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికే అనర్హులకు ఇండ్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను గ్రామస్తులు కోరుతున్నారు.