జహీరాబాద్, జూన్ 20: ఖాతాదారులు, రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని న్యాల్కల్ మండలం హద్నూర్ కెనరా బ్యాంక్ (Canara Bank) మేనేజర్ తుల్జారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ బ్యాంకు అధికారులు సిబ్బంది, ఖాతాదారుల సహకారంతో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించడం గర్వంగా ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖాతాదారులకు ఆధునిక సాంకేతిక సేవలను అందించడంలో ముందంజలో ఉన్నామన్నారు.
తమ బ్యాంకు ద్వారా వ్యవసాయం, ఉపాధి కల్పన, వ్యాపారం, ఇండ్లు, వాహనాలు, డ్వాక్రా సంఘాలకు రుణాలను అందజేస్తున్నామన్నారు, ముఖ్యంగా వ్యవసాయానికి తమ బ్యాంకు ద్వారా రూ.3 లక్షల వరకు రుణాలను అందజేస్తున్నామన్నారు. ఖాతాదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, స్టాండప్ ఇండియా, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమాయో జన వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తు న్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారికి మెరుగైన సేవలు అందించి, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఖాతాదారులు రైతులు తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులో చెల్లిస్తే తిరిగి రుణాలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ అధికారులు దేవంశీ, చందర్ శ్రీ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.