మునిపల్లి, ఆగస్టు 19: వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు.. నీటి సరఫరా లో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటి మరమ్మత్తులు చేపట్టెందుకు మునిపల్లి మండలానికి (Munipalli) గత మే నెలలో ప్రభుత్వం రూ.5లక్షలు విడుదల చేసింది. నిధులు మంజూరు చేసి మూడు నెలలు గడిచినప్పటికీ పల్లెలకు పైసా పంచలేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏమైనట్లు?. ఎక్కడ పోయినట్లు?. ఎండాకాలంలో మంజూరైన నిధులు నేటికి పల్లెలకు ఎందుకు చేరలేదని అని మండల వాసులు సంబంధిత అధికారులు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మునిపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత వేసవిలో గ్రామాల్లో తాగునీటి కోసం కొంతమంది అధికారులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. ఆ బిల్లులు చెల్లించాలంటూ మొరపెట్టుకున్నా మండల అధికారులు నిమ్మకు నిరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యమా, మండల అభివృద్ధి అధికారి నిర్లక్ష్యమో తెలియదు కానీ ప్రభుత్వం మూడు నెలల క్రితం మంజూరు చేసిన డబ్బులు నేటి వరకు పల్లెలకు చేరలేదు.
మండలానికి వచ్చిన రూ.5 లక్షలు ఇప్పటికీ గ్రామాలకు అందిచలేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పనులు చేశారని, ఆయా వివరాలు సేకరించి నిధులు అందించినట్లు తెలిపారు. అయితే పంచాయతీ కార్యదర్శులు మాత్రం తమకు ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు అందలేదన్నారు. అవి వస్తాయో లేదో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు అందించాలని ప్రతీ సమావేశంలో అడుగుతున్నామని, అయినప్పటికీ ఇవ్వడంలేదన్నారు.
అధికారుల నిర్లక్ష్యమా..
మండల పరిషత్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఇష్టసారంగా వ్యవహరించి మండలానికి వచ్చిన రూ.5 లక్షలను సంబంధిత అధికారులకు ఇవ్వడంలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గత మే నెలలో మండలానికి మంజూరైన నిధులను తక్షణమే సంబంధిత కార్యదర్శులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.